




ఓటర్ల వెల్లువ.. రికార్డు స్థాయిలో పోలింగ్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అస్సాం, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ ఉత్సాహంగా సాగింది. మూడు ప్రాంతాల్లో కలిపి 296 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దలు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఆయా రాష్ట్రాల్లో తరలివచ్చి తమ ఓటును వేశారు. చెదురు,మదురు సంఘటనలు మినహ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రాథమిక గణాంకాల ప్రకారం పుదుచ్చేరిలో అత్యధికంగా 89.20 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత అస్సాంలో 85.21 శాతం, కేరళలో 78.12 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి గణాంకాలు వెల్లడయ్యే వరకు ఈ శాతం కొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మూడు ప్రాంతాల్లో కలిపి సుమారు 5.3 కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో రావడంతో చివరి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కనిపించాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను సురక్షితంగా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం
అస్సాం: 85.21%
కేరళ: 78.12%
పుదుచ్చేరి: 89.20% (అత్యధికం)
ఉప ఎన్నికలు కూడా నిర్వహణ
ఈ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఉప ఎన్నికలు నిర్వహించారు. కర్ణాటకలోని దావణగేరి, బాగల్‌కోట్ నియోజకవర్గాల్లో 71.34% శాతం వరకు, నాగాలాండ్‌లోని కోరిడాంగ్ నియోజకవర్గంలో 83.67, త్రిపురలోని ధర్మానగర్ నియోజకవర్గంలో 80.12 శాతం మేర పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, కేంద్ర బలగాల మోహరింపు వంటి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అస్సాంలో 85 శాతం దాటిన పోలింగ్
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 85.21 శాతం ఓటింగ్ నమోదై 2021 ఎన్నికల్లో నమోదైన 82.04 శాతం పోలింగ్‌ను అధిగమించింది. 16 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 90 శాతం దాటింది. డల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.53 శాతం పోలింగ్ నమోదైంది. న్యూ గువాహటి నియోజకవర్గంలో అత్యల్పంగా 72.05 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 2.5 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత పొందారు.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మధ్య పోటీ నెలకొంది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ దశాబ్దం తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అధిక ఓటింగ్‌ను ‘సాధారణం కాదు, చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ప్రజలు తమ సంస్కృతి, భూమి, గుర్తింపును కాపాడుకునేందుకు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన అన్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్‌గోగోయ్ మాత్రం ఈ భారీ పోలింగ్ రాష్ట్రంలో మార్పుకు సంకేతమని వ్యాఖ్యానించారు.
కేరళంలో 78 శాతం పోలింగ్
కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సుమారు 78.12 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2021 ఎన్నికల్లో నమోదైన 74.06 శాతం కంటే ఎక్కువ. కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 81.02 శాతం పోలింగ్ నమోదైంది. పతనంతిట్ట జిల్లాలో అత్యల్పంగా 70.75 శాతం నమోదైంది. చరిత్రాత్మకంగా చూస్తే, 1987లో కేరళలో 80.54 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక పోలింగ్ 1960లో 85.72 శాతంగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో నిలిచిన ఓటర్లను కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం శాతం మరింత పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ కూటమి మూడోసారి వరుసగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పోటీ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ ఎన్నికలను రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ఎన్నికలుగా పేర్కొన్నారు.
పోలింగ్ ప్రశాంతంగా
పోలింగ్ ప్రక్రియ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ప్రశాంతంగానే సాగింది. కొన్నిచోట్ల చిన్నపాటి సాంకేతిక సమస్యలు తప్ప పెద్దగా ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ప్రారంభం సుమారు 30 నిమిషాలు ఆలస్యమైంది. అయినప్పటికీ మొత్తం ఎన్నికల ప్రక్రియ క్రమబద్ధంగా సాగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యూ కేల్కర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ పోలింగ్ శాతంపై ప్రభావం చూపిందని చెప్పారు.
రాజకీయ పార్టీల ప్రతిస్పందనలు
సీపీఎం నేత సీఎన్. మోహన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ వల్ల పోలింగ్ శాతం పెరిగిందని తెలిపారు. మరణించినవారు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు తొలగించడంతో పోలింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు దీప్తి మేరి వర్గీస్ 0మాట్లాడుతూ అధిక పోలింగ్ శాతం సాధారణంగా యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
సీపీఎం నేత ఏఎం. ఆరిఫ్ మాత్రం పోలింగ్ శాతం ఆధారంగా ఎవరు గెలుస్తారో చెప్పలేమని హెచ్చరించారు.
బీజేపీ నాయకుడు కేఎస్.శైజు ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారని, అది తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రముఖుల ఓటింగ్
రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కన్నూర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ ఎన్నికలు కేరళ అభివృద్ధి దిశను నిర్ణయించే ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత వీడీ. సతీశన్ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. రాష్ట్రంలో మార్పు కోరుకునే ప్రజాభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి కూడా సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేశారు. ఈసారి రాష్ట్రంలో మార్పు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సినీ ప్రముఖుల ఓటింగ్
రాష్ట్రవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించారు. ప్రముఖ మలయాళ నటులు మమ్ముటి, మోహన్‌లాల్ వరుసగా ఎర్నాకులం, తిరువనంతపురంలో తమ ఓటు వేశారు.
పుదుచ్చేరిలో అత్యధిక ఓటింగ్
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 89.20 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం సుమారు 10 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రధాన పోటీగా నిలిచింది.
మే 4న ఫలితాలు
అస్సాం, కేరళం, పుదుచ్చేరి ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల భవితవ్యం తేలనుంది.
