Let's talk: editor@tmv.in
ఓటర్‌గా పేరు నమోదు చేయించుకోండి: నేపాల్ తాత్కాలిక ప్రధాని పిలుపు

ఓటర్‌గా పేరు నమోదు చేయించుకోండి: నేపాల్ తాత్కాలిక ప్రధాని పిలుపు

Pinjari Chand
9 నవంబర్, 2025

రాబోయే సాధారణ ఎన్నికలకు నేపాల్‌ సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ అర్హులైన పౌరులందరినీ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఓటర్ నమోదు ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్న సందర్భంగా వీడియో ప్రకటన విడుదల చేసిన కార్కీ, ప్రజాస్వామ్య సమాజానికి పునాది జాగృత పౌరుల అవగాహన, వారి ఓటు హక్కు సద్వినియోగం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుల కలలను నెరవేర్చే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మన అంతరాత్మ, రెండోది ఆ అంతరాత్మకు రూపమిచ్చే సాధనం ‘ఓటరు గుర్తింపు కార్డు’. ఈ రెండింటి సద్వినియోగం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె అన్నారు.

తాజా ఓటర్లలో ముఖ్యంగా యువ (జెన్ జెడ్ ) తరం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కార్కీ సూచించారు. మన కలల నేపాల్‌ను నిర్మించే మొదటి అడుగు ఓటర్‌గా నమోదు కావడం అని ఆమె పిలుపునిచ్చారు. సరైన ప్రతినిధిని ఎంచుకోండి లేదా మీరే స్వయంగా ప్రతినిధిగా మారండి. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలని ప్రధాని అన్నారు. నేపాల్ ఎన్నికల కమిషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓటర్ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేసింది. నవంబర్ 16 వరకు ఓటర్ల పేర్ల నమోదు కొనసాగుతుంది. 2026 మార్చి 4 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఓటు హక్కును పొందగలరు.

ఆసక్తి చూపిస్తున్న యువత

ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం యువత ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మహిళలు, దివ్యాంగులు కూడా ఓటరు నమోదులో ఆసక్తి చూపిస్తున్నారని మధ్యేశ్ ప్రావిన్స్ ఎన్నికల అధికారి లుమనాథ్ పోఖ్రెల్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8–9 తేదీల్లో యువత ఆధ్వర్యంలో జరిగిన జెన్‌జెడ్ ఉద్యమం అప్పటి ప్రధాని కెపీ శర్మ ఒలీ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఈ ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వ చర్యల్లో 72 మంది మరణించారు. అనంతరం మూడు రోజుల చర్చల తర్వాత మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆమె సిఫార్సుతో ప్రెసిడెంట్ రామ్‌చంద్ర పౌడెల్ పార్లమెంటును రద్దు చేసి 2026 మార్చి 5న కొత్త ఎన్నికల తేదీన ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కమిషన్ సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో సేవల్లో అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఈ వారం చివరి నాటికి ఒక లక్షా యాభై వేలకుపైగా కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. 2025 ఏప్రిల్ నాటికి దేశంలో మొత్తం 1,81,48,654 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 9,14,806 మంది పురుషులు, 8,84,757 మంది మహిళలు, 185 మంది ఇతర వర్గాలవారు ఉన్నారని కమిషన్ వివరించింది. దనుషా జిల్లా నివాసి బ్రిజేశ్ యాదవ్ మాట్లాడుతూ ‘ముప్పై ఏళ్లుగా అదే పాత ముఖాలు కనిపిస్తున్నాయి. కొత్త తరానికి అవకాశం రావాలి. ప్రజల కోసం నిజంగా పనిచేయగల వారికే ఓటు వేయాలి అన్నారు. ఎన్నికల అవగాహన కార్యక్రమాలు, యువత ఆధ్వర్యంలోని ఉద్యమాలు, పౌరసంఘాల చొరవ కారణంగా ఈసారి ఓటర్ రిజిస్ట్రేషన్‌లో భారీ వృద్ధి నమోదవుతున్నట్లు కమిషన్ తెలిపింది.

ఓటర్‌గా పేరు నమోదు చేయించుకోండి: నేపాల్ తాత్కాలిక ప్రధాని పిలుపు - Tholi Paluku