
ఓటరు జాబితా సవరణపై బెంగాల్‌లో ఆందోళనలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయం ఉండగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు పలు జిల్లాల్లో రహదారులు, జాతీయ రహదారులను దిగ్బంధించారు. మాల్దా, జల్పైగురి, కూచ్ బేహార్, పుర్బా బర్ధమాన్ జిల్లాల్లో నిరసనకారులు టైర్లు దహనం చేస్తూ రహదారులు బ్లాక్ చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఒక రోజు ముందు మాల్దా జిల్లాలోని కాలియాచక్ ప్రాంతంలో ఓటర్ల జాబితా సవరణ పనిలో నిమగ్నమైన ఏడుగురు న్యాయాధికారులను ఆందోళనకారులు గంటల పాటు చుట్టుముట్టిన ఘటన చోటుచేసుకుంది. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అనంతరం భద్రతా సిబ్బంది వారిని రక్షించారు.
అన్ని పత్రాలు ఉన్నా.. పేర్లు తొలగించారు
పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపిస్తూ నిరసనకారులు కొల్‌కత్తా–సిలిగురిని కలిపే నేషనల్ హైవే 12ను బ్లాక్ చేశారు. మాల్దా జిల్లాలోని మంగళ్‌బారి ప్రాంతంలో గురువారం ఉదయం మళ్లీ నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు టైర్లు తగలబెట్టి, బాంబూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇంగ్లీష్ బజార్ ప్రాంతంలోని జాదుపూర్‌లో కూడా ఇలాంటి ఆందోళన జరిగింది. మా వద్ద అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా నుంచి మా పేర్లు తొలగించారు. వెంటనే సరిదిద్దాలని ఒక నిరసనకారి తెలిపారు. మంగళ్‌బారి వద్ద జరిగిన రహదారి దిగ్బంధం దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. అనంతరం మాల్దా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ షేక్ అన్సార్ అహ్మద్ అక్కడికి చేరుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. పోలీసులు దిగ్బంధాన్ని తొలగించే ప్రయత్నం చేయగా నిరసనకారులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని, ఒక డ్రైవర్‌కు తలకు గాయాలు అయినట్లు చెప్పారు.
జాతీయ రహదారుల దిగ్బంధం
ఇదిలా ఉండగా జల్పైగురి జిల్లాలోని మైనాగురి ప్రాంతంలో స్థానికులు గురువారం ఉదయం నుంచి నేషనల్ హైవే27ను బ్లాక్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత అనేక మంది నిజమైన ఓటర్ల పేర్లు ‘డిలీటెడ్’గా లేదా ‘అడ్జుడికేషన్’లో ఉంచారని వారు ఆరోపించారు. దీంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిరసనకారులు ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ పేర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అధికారులు, భద్రతా సిబ్బంది చర్చలు జరిపిన తర్వాత గంటల తర్వాత దిగ్బంధం ఎత్తివేశారు. అలాగే మైనాగురి–లాటాగురి రోడ్డును కూడా మరో నిరసనకారుల గుంపు బ్లాక్ చేసింది. ఆసియన్ హైవేలో భాగమైన మైనాగురి–ధుప్గురి మార్గం కూడా చురాభండార్ వద్ద దిగ్బంధానికి గురైంది.
కూచ్ బేహార్ జిల్లాలోని పచాగఢ్ గ్రామపంచాయతీ పరిధిలోని మదరసా మోర్ ప్రాంతంలో కూడా ప్రజలు కూచ్ బేహార్–మథాభంగా రాష్ట్ర రహదారిని దాదాపు మూడు గంటల పాటు దిగ్బంధించారు. ఓటర్ల జాబితాలో అనేక పేర్లు ‘అదృశ్యమయ్యాయి’ అంటూ వారు అధికారులను వివరణ కోరారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలోని శక్తిగఢ్‌లో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. అనేక మంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించడం లేదని ఆరోపిస్తూ బర్ధమాన్–2 బ్లాక్ బీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
