Let's talk: editor@tmv.in
ఓట‌మి త‌ర్వాత తొలిసారి ఉత్త‌రాంధ్ర‌కు జ‌గ‌న్

ఓట‌మి త‌ర్వాత తొలిసారి ఉత్త‌రాంధ్ర‌కు జ‌గ‌న్

FL - BRTH
8 అక్టోబర్, 2025

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌ర్సీప‌ట్నం వెళ్ల‌బోతున్నారు. ఈనెల 9న ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉండ‌బోతోంది. ఈ మేర‌కు వైసీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా జగ‌న్ ప‌ర్య‌ట‌న ఉండే విధంగా రూట్ మ్యాప్ రూపొందించిన‌ట్టు స‌మాచారం. వైఎస్ జ‌గ‌న్ రైతాంగం స‌మ‌స్య‌ల‌పై వ‌రుస‌ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల త‌ర్వాత కొంత విరామం ఇచ్చారు. ఇప్పుడు ఓటమి త‌ర్వాత తొలిసారి ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌, అందులోనూ న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌ వ్యూహాత్మ‌క‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో 17 మెడిక‌ల్ క‌ళాశాలల నిర్మాణానికి అనుమ‌తులు తెచ్చి, వాటిలో ఐదింటిని పూర్తీ చేసి, అడ్మిష‌న్లు ప్రారంభించామ‌ని వైసీపీ చెబుతోంది. టీడీపీ మాత్రం నిర్మాణ ప‌నులు ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంద‌ని ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లి త‌న హాయాంలో జ‌రిగిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని, ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అందులో భాగంగా ఈనెల 9న న‌ర్సీప‌ట్నంలోని నిర్మాణంలో ఉన్న మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నాన్ని సంద‌ర్శించ‌బోతున్నారు.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడిక‌ల్ కాలేజీలు చాలానే ఉన్నాయి. కానీ అక్క‌డికి వెళ్ల‌కుండా ఉత్త‌రాంధ్ర‌, అందులోనూ న‌ర్సీప‌ట్నం ఎంచుకోవ‌డం వ్యూహాత్మ‌కం అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఉత్త‌రాంధ్ర టీడీపీకి ప‌ట్టున్న ప్రాంతం. అందులోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణంగా దెబ్బ‌తింది. ఓట‌మి తర్వాత రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. కానీ ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌లేదు. కాబ‌ట్టి వ్యూహాత్మ‌కంగా ఉత్త‌రాంధ్ర‌ను ఎంచుకున్నారు. దీంతోపాటు న‌ర్సీప‌ట్నం ఎంచుకోవ‌డం వెనుక మ‌రోకార‌ణం ఉంద‌న్న చ‌ర్చ ఉంది.

ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి బ‌ల‌మైన గొంతు స్పీక‌ర్ అయ్యన్న‌పాత్రుడు. న‌ర్సీప‌ట్నం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో అసెంబ్లీలో వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. మ‌రోవైపు వైసీపీపై మాట‌ల తూటాలు పేల్చుతూనే ఉంటారు. కాబ‌ట్టి అయ్య‌న్న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర్సీప‌ట్నం నుంచి ఉత్త‌రాంధ్ర‌లో పోరాటం మొద‌లుపెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ట‌. అందుకే న‌ర్సీప‌ట్నం మెడిక‌ల్ కాలేజీ సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. అక్క‌డి నుంచే అయ్య‌న్న గురించి, టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం గురించి విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్ట‌బోతున్నార‌న్న చ‌ర్చ వైసీపీలో జ‌రుగుతోంది.

ఓట‌మి త‌ర్వాత ఉత్త‌రాంధ్ర మొద‌టి ప‌ర్య‌ట‌న కావ‌డంతో ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చేలా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు, బ‌ల్క్ డ్ర‌గ్ ప‌రిశ్ర‌మ బాధితుల‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతారు. అదే మార్గంలోప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేలా వైసీపీ వ్యూహాత్మ‌కంగా రూట్ మ్యాప్ ప్లాన్ చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నంలో ఏం మాట్లాడుతారు అన్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటు వారికి అప్ప‌గిస్తే అధికారంలోకి వ‌చ్చాక తాము ప్ర‌భుత్వం ఆధీనంలోకి తీసుకుంటామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోతున్నారు అన్న ఆసక్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఓట‌మి త‌ర్వాత తొలిసారి ఉత్త‌రాంధ్ర‌కు జ‌గ‌న్ - Tholi Paluku