
ఒలింపిక్స్–2036 బిడ్ బాధ్యతలు అప్పగించారు: లియాండర్ పేస్
భారత్ 2036 ఒలింపిక్ క్రీడలను ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో చేస్తున్న బిడ్‌కు సంబంధించి తనకు బాధ్యతలు అప్పగించారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ శనివారం తెలిపారు. ప్రజా జీవితంలో తన కొత్త పాత్రలో ఇది కీలక బాధ్యతగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఏడు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న పేస్ మాట్లాడుతూ, యువత అభివృద్ధి, క్రీడల పురోగతికి కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తనకు బాధ్యత అప్పగించారని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత కొల్‌కత్తాలో తొలి మీడియా సమావేశంలో పేస్ మాట్లాడుతూ మోడీజీ నాకు స్పష్టమైన దిశ చూపించారు. యువత, క్రీడల అభివృద్ధి కోసం పని చేయాలని చెప్పారు. 2036 ఒలింపిక్స్ బాధ్యతను కూడా నాకు అప్పగించారు. ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకురావడానికి ఒక బృందంతో కలిసి కష్టపడాలని అన్నారు.
ప్రతిభను ప్రోత్సాహించాలి
అలాగే కామన్‌వెల్త్ గేమ్స్ 2030 ఎడిషన్‌ను గుజరాత్‌లో నిర్వహించే ప్రయత్నాలకు కూడా తాను సహకరిస్తానని చెప్పారు. ముఖ్యంగా ఆహ్మదాబాద్ నగరంలో ఈ క్రీడలను నిర్వహించే ప్రతిపాదనపై పని చేయనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణ భారత్‌లో క్రీడా వ్యవస్థను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉందని, అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేస్తుందని పేస్ పేర్కొన్నారు. క్రీడా విజయాలు, ఆర్థిక బలం మధ్య సంబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2024 సమ్మర్ ఒలంపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశాలైన అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ ప్రపంచంలో అగ్ర ఆర్థిక వ్యవస్థలుగా కూడా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్ కూడా బలమైన క్రీడా సంస్కృతి నిర్మించుకోవడం, మౌలిక వసతులు అభివృద్ధి చేయడం, గ్రామీణ స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి విజయాలను సాధించాలని పేస్ సూచించారు. క్రీడలు, క్రీడా విద్య ద్వారానే ఒక సూపర్ పవర్‌ను నిర్మించగల సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. యువ క్రీడాకారులను అభివృద్ధి చేయడం భారత్ ఒలింపిక్ లక్ష్యాలను సాధించడంలో కీలకమని అన్నారు.
క్రీడా వసతులు మెరుగుపరచాలి
అలాగే పశ్చిమ బెంగాల్‌లో క్రీడా మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక ఇండోర్ టెన్నిస్ స్టేడియం లేకపోవడం వల్ల డేవిస్‌కప్ వంటి అంతర్జాతీయ పోటీల సమయంలో తాత్కాలికంగా చెక్క కోర్టులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని చెప్పారు. తదుపరి రెండు దశాబ్దాల్లో క్రీడలు, విద్య ద్వారా 25 కోట్ల మంది పిల్లల జీవితాలపై ప్రభావం చూపడం తన పెద్ద లక్ష్యమని తెలిపారు. దేశ యువతే భారత్ ఒలింపిక్ ఆశయాలను, ప్రపంచ స్థాయిలో ఎదుగుదలను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. క్రీడాకారుడిగా నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం తనకు కొత్త ఆటలాంటిదని, టెన్నిస్ కెరీర్‌లో చూపిన ఉత్సాహం, కట్టుబాటుతోనే ఈ బాధ్యతలను నిర్వర్తిస్తానని పేస్ తెలిపారు.
