Let's talk: editor@tmv.in
ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి ప్రయత్నాలు చేస్తున్నాం: ప్రధాని మోడీ

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి ప్రయత్నాలు చేస్తున్నాం: ప్రధాని మోడీ

Pinjari Chand
5 జనవరి, 2026

2036లో నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో భారత్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశంలో భారీ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించడం ద్వారా యువ క్రీడాకారులకు మరిన్ని పోటీ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. వారణాసిలో జరుగుతున్న 72వ సీనియర్ జాతీయ వాలీబాల్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవాన్ని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ క్రీడల పట్ల దేశంలో గత దశాబ్దంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తోందని చెప్పారు.

2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో జరగనున్నాయి. అదే విధంగా 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బలమైన ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా మరింత మంది క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా వందలాది మంది యువత జాతీయ స్థాయికి ఎదిగారని పేర్కొన్న ప్రధాని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీవోపీఎస్) వంటి పథకాలు భారత క్రీడా వ్యవస్థను పూర్తిగా మారుస్తున్నాయని చెప్పారు. మౌలిక వసతులు, నిధులు సమకూర్చడం, అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

2036 సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం బిడ్ వేస్తున్నట్లు సమాచారం. అహ్మదాబాద్–గాంధీనగర్‌ను ట్విన్ సిటీలుగా అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయి క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు, ఇందుకోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.34,700 కోట్ల నుంచి రూ.64,000 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని అంచనా.

బడ్జెట్ పెరిగింది

గత పదేళ్లలో భారత్ 20కుపైగా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించిందని, ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లు అందులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. క్రీడల పట్ల ఒకప్పుడు ప్రభుత్వం, సమాజం పెద్దగా ఆసక్తి చూపలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. క్రీడల బడ్జెట్ గణనీయంగా పెరిగిందని, ప్రతిభ గుర్తింపు, శాస్త్రీయ శిక్షణ, పోషణ, పారదర్శక ఎంపిక విధానాలపై దృష్టి పెట్టిన ‘అథ్లెట్-సెంట్రిక్’ మోడల్‌ను భారత్ అనుసరిస్తోందని తెలిపారు. జాతీయ క్రీడా పాలన చట్టం, ఖేలో భారత్ పాలసీ–2025 ద్వారా క్రీడా సంస్థల్లో పారదర్శకత పెరుగుతుందని, సరైన ప్రతిభకు అవకాశాలు లభిస్తాయని ప్రధాని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ యువత సమాంతరంగా ఎదిగేలా ఈ విధానాలు సహాయపడతాయని చెప్పారు.

క్రీడా కేంద్రంగా వారణాసి ఎదుగుతుండటంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ వాలీబాల్ పోటీలకు ఈ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయమన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వాలీబాల్‌కు దేశ అభివృద్ధికి మధ్య పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ప్రధాని ‘వాలీబాల్ మనకు సమన్వయం, విశ్వాసం, జట్టు స్పూర్తి నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ తమ పాత్రను బాధ్యతగా నిర్వహించినప్పుడే విజయం సాధ్యం. భారత్ కూడా ఇదే మార్గంలో ముందుకెళ్తోందని అన్నారు.

వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ముఖ్యం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని ఊహించిన మోడల్ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి భారతీయుడికి లాభం చేకూరుతోందని చెప్పారు. క్రీడలు ఇక సమయ వ్యర్థం కాదని, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.