Let's talk: editor@tmv.in
ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో 12 వేల మందికి ఉద్వాసన!

ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో 12 వేల మందికి ఉద్వాసన!

Shaik Mohammad Shaffee
2 ఏప్రిల్, 2026

ఐటీ రంగంలో మరోసారి లేఆఫ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రముఖ అమెరికా ఐటీ సంస్థ ఒరాకిల్ భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. భారత్‌లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు సమాచారం. గతేడాది కాలంగా ఐటీ రంగంలో కొనసాగుతున్న అనిశ్చితికి తోడు, సంస్థలో జరుగుతున్న వ్యవస్థాగత మార్పులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులపై ఒరాకిల్ వేటు వేసింది.

వ్యవస్థాగత మార్పులే కారణం

సంస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా కొన్ని విభాగాలు, హోదాలు ఇప్పుడు అవసరం లేదని భావిస్తున్నట్లు ఒరాకిల్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. "సంస్థలో చేపట్టిన మార్పుల కారణంగా మీ ప్రస్తుత పొజిషన్ ఇకపై కొనసాగదు" అంటూ బాధిత ఉద్యోగులకు సమాచారం అందించింది. భారత్‌లో ఒరాకిల్‌కు సుమారు 30,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా చర్యతో దాదాపు 40 శాతం మంది ఉపాధి కోల్పోయారు. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదని, నెల రోజుల్లోనే మరో విడత భారీ ఉద్వాసనలు ఉండవచ్చని సంస్థకు చెందిన మానవ వనరుల విభాగం ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

అరకొర పరిహారం.. షరతులు వర్తిస్తాయ్!

ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న వారికి ఒరాకిల్ సంస్థ కొంత ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం, ఒక ఉద్యోగి కంపెనీలో ఎన్ని ఏళ్లు పనిచేస్తే, అన్ని ఏళ్లకు కలిపి ఒక్కో ఏడాదికి 15 రోజుల జీతం చొప్పున అదనంగా ఇస్తారు. దీనితో పాటు ఒక నెల నోటీసు కాలానికి అయ్యే జీతం, వాడుకోని సెలవులకు ఇచ్చే డబ్బు (లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్), గ్రాట్యుటీ వంటివి కూడా చెల్లిస్తారు. వీటన్నింటికీ అదనంగా మరో రెండు నెలల జీతాన్ని బోనస్‌గా ఇస్తామని సంస్థ తెలిపింది. అయితే ఈ సౌకర్యాలన్నీ కేవలం స్వచ్ఛందంగా, సామరస్యపూర్వక పద్ధతిలో రాజీనామా చేసే వారికే వర్తిస్తాయని సంస్థ షరతు విధించింది. ఈ పరిణామాలపై అధికారికంగా స్పందించడానికి ఒరాకిల్ యాజమాన్యం నిరాకరించింది.

పని ఒత్తిడిపై నిరసనలు

ఒరాకిల్‌లో పని వేళలు, పని ఒత్తిడిపై గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 16 గంటల పని షిఫ్టులను నిరసించినందుకు తనను గతేడాది సెప్టెంబరులోనే తొలగించారని ఓ మాజీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భారత్‌లోనే కాకుండా, అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై కూడా ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని స్థానిక చట్టాలు ఆ దేశ పౌరుల తొలగింపు విషయంలో కఠినంగా ఉండటంతో, అక్కడ పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులనే సంస్థ లక్ష్యంగా చేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస తొలగింపులతో ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.