
ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఒమన్ సుల్తాన్ హతింబిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబహ్ అల్ ఖలేద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబహ్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా దేశాలపై జరిగిన దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, అక్కడ నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో, ప్రతీకార చర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. గత రెండు రోజుల్లో ప్రధాని బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా యువరాజు, జోర్డాన్ రాజు అబ్దుల్లా-II, యుఎఈ అధ్యక్షుడు ముహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ తో కూడా మాట్లాడి ప్రాంతీయ శాంతి, సార్వభౌమత్వ పరిరక్షణపై భారతదేశం మద్దతు తెలియజేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా ప్రధాని సంభాషణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
భారతీయుల భద్రతపై ఆందోళన
వెస్ట్ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్‌లో దాదాపు 10,000 మంది, ఇజ్రాయెల్‌లో 40,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో దుబాయ్, దోహా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందలాది భారతీయులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ప్రవాస భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
