
ఒమన్ తీరంలో చమురు నౌకపై డ్రోన్ దాడి.. భారతీయుడి మృతి
ఒమన్ తీరంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మస్కట్ గవర్నరేట్ సమీపంలో ప్రయాణిస్తున్న 'ఎంకేడీ వ్యోమ్' అనే చమురు ట్యాంకర్‌ను పేలుడు పదార్థాలతో కూడిన మానవ రహిత డ్రోన్ బోటు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నౌకలో పనిచేస్తున్న ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఒమన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ధృవీకరించింది.
ముగిసిన సహాయక చర్యలు.. 21 మంది సురక్షితం
మస్కట్ తీరానికి సుమారు 52 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీయులు, ఒక ఉక్రెయిన్ పౌరుడు ఉన్నారు. మరణించిన భారతీయుడు మినహా మిగిలిన 21 మందిని అధికారులు సురక్షితంగా ఖాళీ చేయించారు. పనామా ఫ్లాగ్‌తో వెళ్తున్న 'ఎంవీ సాండ్' అనే వాణిజ్య నౌక సహాయంతో వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఒమన్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ నౌక సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తూ, ఇతర నౌకలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది.
భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనలో భారతీయ సిబ్బంది మృతి చెందడం పట్ల ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది. నౌకలోని ఇతర భారతీయ పౌరులను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
వరుస దాడులతో ఆందోళన
ప్రాంతీయ జలాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆదివారం కూడా హార్ముజ్ జలసంధిలో 'ఎంవీ స్కైలైట్' అనే మరో చమురు ట్యాంకర్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడగా, ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు భారతీయుడు కాగా, మరొకరు ఇరానియన్ అని సమాచారం. మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న ‘ఎంకేడీ వ్యోమ్’ నౌకలో దాదాపు 59,463 మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో వరుసగా జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కలవరపెడుతున్నాయి.
