Let's talk: editor@tmv.in
ఒప్పందం అమలయ్యే వరకు ఇరాన్‌ చుట్టూనే మా బలగాలు: ట్రంప్
ఒప్పందం అమలయ్యే వరకు ఇరాన్‌ చుట్టూనే మా బలగాలు: ట్రంప్

ఒప్పందం అమలయ్యే వరకు ఇరాన్‌ చుట్టూనే మా బలగాలు: ట్రంప్

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో కుదిరిన 'అసలైన ఒప్పందం' అక్షరాలా అమలు కావాల్సిందేనని, లేనిపక్షంలో మునుపెన్నడూ చూడని రీతిలో సైనిక చర్య ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, భారీ ఆయుధ సంపత్తితో కూడిన సైన్యం మోహరించే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా సైన్యం సిద్ధం: ట్రంప్

తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు. "ఇరాన్ చుట్టుపక్కల మా విమాన వాహక నౌకలు, సైనిక బలగాలు పూర్తి ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న శత్రువును పూర్తిగా నాశనం చేసేందుకు ఇది అవసరం. ఒకవేళ ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో యుద్ధం మొదలవుతుంది. అమెరికా మళ్లీ రంగంలోకి దిగుతుంది" అని ఆయన పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి కచ్చితంగా తెరిచే ఉంటుందని, ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండే ప్రసక్తే లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు.

‘అదో పెద్ద మోసం’

ఇరాన్-అమెరికా చర్చల విషయంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వంటి సంస్థలు ఇరాన్ ప్రతిపాదించిన '10 పాయింట్ల ప్లాన్'ను అమెరికా అంగీకరించిందంటూ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, ఆ ప్లాన్‌ను తాము ఎప్పుడో చెత్తబుట్టలో వేశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ఇరాన్ ప్రచారం చేసే మాటలకు, వ్యక్తిగతంగా అమెరికా టీమ్‌తో మాట్లాడే విషయాలకు చాలా తేడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

హార్ముజ్ జలసంధి వద్ద హైడ్రామా

ప్రపంచ ముడిచమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. దీనిపై బ్రిటన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "సముద్ర ప్రయాణ స్వేచ్ఛ అంటే ఉచిత ప్రయాణం అని అర్థం. అంతర్జాతీయ జలాల్లో టోల్ వసూళ్లకు తావులేదు" అని బ్రిటీష్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ విప్లవ దళాలు మైన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలతో కూడిన మ్యాప్‌లను విడుదల చేయడం ఉత్కంఠ రేపుతోంది.

భగ్గుమంటున్న ముడిచమురు ధరలు

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో 250 మందికి పైగా మరణించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఖలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 96.71 డాలర్లకు చేరుకుంది. పాకిస్థాన్ వేదికగా నేడు ప్రారంభం కానున్న శాంతి చర్చల ఫలితాలపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.