Let's talk: editor@tmv.in
ఒడిశా మహిళలకు శుభవార్త: వారం రోజుల్లో 4.57 లక్షల మంది ఖాతాల్లోకి 'సుభద్ర' నగదు!

ఒడిశా మహిళలకు శుభవార్త: వారం రోజుల్లో 4.57 లక్షల మంది ఖాతాల్లోకి 'సుభద్ర' నగదు!

Dantu Vijaya Lakshmi Prasanna
10 జనవరి, 2026

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని సుమారు 4,57,681 మంది అదనపు లబ్ధిదారులకు వారం రోజుల్లోగా 'సుభద్ర' పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం భువనేశ్వర్‌లో డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొత్త వారికి తక్షణ ఊరట

తాజాగా లబ్ధి పొందే వారిలో సుమారు 1,78,398 మంది యువతులు ఉన్నారు. వీరంతా ఇటీవల 21 ఏళ్లు నిండి, కొత్తగా ఈ పథకానికి అర్హత సాధించిన వారు. మిగిలిన వారు గతంలో దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తయిన లబ్ధిదారులు. వీరిందరికీ వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ కానుంది.

మార్చి 8న నాలుగో విడత విడుదల

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా మాట్లాడుతూ, పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

సుభద్ర యోజన పథకం

బిజెపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా మహిళలకు భారీ ఆర్థిక చేయూత అందుతోంది. ఈ పథకం మొత్తం సాయం 5 ఏళ్ల కాలంలో ఒక్కో మహిళకు రూ. 50,000 అందుతాయి. అలా చూస్తే వార్షిక నగదుగా ఏటా రూ. 10,000 చొప్పున ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు (రాఖీ పూర్ణిమ, మార్చి 8న) రూ. 5,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది.

ఒడిశా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 1.18 కోట్ల మంది మహిళలు ఈ పథకం కింద నమోదై, ప్రయోజనాలను అందుకుంటున్నారు. ఈ వారం తాజాగా ప్రకటించిన 4.57 లక్షల మంది అదనపు లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1 కోటి 8 లక్షల మంది మహిళలకు ఈ పథకాన్ని చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు

ఈ పథకం మొదటి విడతగా 2024 సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమై, వివిధ దశల్లో కోటి మందికి పైగా మహిళలకు అందింది. రెండవ విడతలో 2025 మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) సుమారు 1.18 కోట్ల మంది ఖాతాల్లో రూ. 5,000 జమ అయ్యాయి. మూడవ విడతలో 2025 ఆగస్టులో రాఖీ పౌర్ణమి సందర్భంగా సుమారు 1 కోటి మందికి పైగా మహిళలకు నగదు బదిలీ చేశారు. ప్రస్తుతం నాలుగవ విడత 2026 మార్చి 8న విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ పథకం కోసం మొత్తం రూ. 55,825 కోట్లు కేటాయించింది, దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో ప్రతి మహిళకు రూ. 50,000 అందుతాయి.

అర్హతలు ఇవే..

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే మహిళలు 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలాగే వారు ఒడిశా రాష్ట్ర నివాసితులై ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.6 లక్షల మంది మహిళలకు తక్షణమే ఆర్థిక ప్రయోజనం కలగనుంది. అటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా లైన్ క్లియర్ కావడంతో మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది.