
ఒడిశా తీరంలో అరుదైన డాల్ఫిన్ల సందడి.. ఒక్కచోటే 13 గుర్తింపు
అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల సామూహిక గూళ్ల ఏర్పాటుకు ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని గంజాం జిల్లా రుషికుల్య నదీ ముఖద్వారం, ఇప్పుడు అరుదైన ‘ఇరావడి’ డాల్ఫిన్లకు కూడా నిలయంగా మారుతోంది. ఇటీవల అటవీ శాఖ చేపట్టిన జలచరాల గణనలో భాగంగా ఖల్లికోట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బటేశ్వర్ సమీపంలో 13 ఇరావడి డాల్ఫిన్లు గుంపులుగా సంచరిస్తూ కనిపించాయని అధికారులు వెల్లడించారు. జనవరి 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ జలచరాల గణనలో ఇవి నీటిపైకి వస్తూ సందడి చేయడం అధికారుల దృష్టికి వచ్చింది.
సముద్ర గర్భంలో జీవ వైవిధ్యం
పురునబంధ్-ప్రయాగి మధ్య గల తీర ప్రాంతంలో డాల్ఫిన్ల ఉనికి ఆరోగ్యకరంగా ఉందని ఖల్లికోట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) దివ్య శంకర్ బెహరా తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 'బాటిల్ నోస్', 'హంప్‌బ్యాక్' జాతి డాల్ఫిన్లు మాత్రమే కనిపించేవని, కానీ ఇప్పుడు అరుదైన ఇరావడి జాతి ఇక్కడ తారసపడటం విశేషమని పేర్కొన్నారు. చిలికా సరస్సులో అత్యధికంగా ఉండే ఈ డాల్ఫిన్లు, అక్కడి నుంచి వలస వచ్చి ఈ నదీ ముఖద్వారం వద్ద స్థిరపడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం రుషికుల్య తీర ప్రాంత పర్యావరణ ప్రాముఖ్యతను మరింత పెంచింది.
స్థానిక మత్స్యకారుల సహకారం
గత కొన్నేళ్లుగా ఒలీవ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణలో స్థానిక మత్స్యకారులు, గ్రామస్థులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు డాల్ఫిన్లు కూడా కనిపించడంతో, వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యతపై అటవీ శాఖ అవగాహన కల్పిస్తోంది. కేవలం తాబేళ్లనే కాకుండా, ఇక్కడికి వలస వచ్చే విదేశీ పక్షులు, ఇతర జలచరాల రక్షణపై గ్రామస్థులు ఎంతో చైతన్యంతో ఉన్నారని ఏసీఎఫ్ వివరించారు. ఈ ప్రాంతం జీవ వైవిధ్య హాట్ స్పాట్‌గా మారుతున్న తరుణంలో, ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్త రవీంద్ర నాథ్ సాహు కోరారు.
ఫిబ్రవరిలోనే తాబేళ్ల రాక
సాధారణంగా ఫిబ్రవరి మూడో వారంలో వేల సంఖ్యలో ఒలీవ్ రిడ్లే తాబేళ్లు సామూహిక గూళ్ల కోసం (మాస్ నెస్టింగ్) రుషికుల్య తీరానికి చేరుకుంటాయి. వీటికి తోడుగా ప్రతి శీతాకాలంలో బార్-హెడెడ్ గీస్ వంటి వలస పక్షులు కూడా ఇక్కడ విడిది చేస్తాయి. తాజా గణనలో ఇరావడి డాల్ఫిన్లు కూడా తోడవడంతో ఈ ఎకో-సిస్టమ్ మరింత సుసంపన్నమైందని వన్యప్రాణి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిలికా సరస్సు: ఇరావాడీ డాల్ఫిన్ల అద్భుత ఆవాసం
చిలికా సరస్సు (ఒడిశా) ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు మాత్రమే కాదు, అరుదైన ఇరావాడీ డాల్ఫిన్లకు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సహజ ఆవాసం. సాధారణ డాల్ఫిన్లలా వీటికి పొడవైన ముక్కు ఉండదు, బదులుగా గుండ్రని తల, ఉబ్బెత్తుగా ఉండే నుదురుతో ఇవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ముదురు బూడిద రంగులో ఉండే ఇవి, నోటి ద్వారా నీటిని ఫౌంటెన్ లాగా చిమ్ముతూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. భారతదేశంలో కేవలం చిలికా సరస్సులోనే కనిపించే ఈ డాల్ఫిన్లు చాలా సిగ్గరి జంతువులు. ఇవి మనుషులకు దూరంగా ఉంటూ కేవలం శ్వాస తీసుకోవడానికి మాత్రమే నీటి పైకి వస్తాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 160 వరకు ఉండగా, సరస్సులోని 'సతపడ' ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఉప్పునీరు, మంచి నీరు కలిసే చోట చేపలు, రొయ్యలను తింటూ జీవించే ఈ డాల్ఫిన్లు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యాటక పడవల శబ్దం, వలల వల్ల వీటికి ముప్పు కలగకుండా ప్రభుత్వం అత్యున్నత రక్షణ కల్పిస్తోంది. చిలికా సరస్సు పర్యావరణం బాగుంది అని చెప్పడానికి ఈ డాల్ఫిన్ల ఉనికి ఒక గొప్ప నిదర్శనం.
