
ఒడిశా ఎమ్మెల్యేల జీతాలు మూడు రెట్లు పెంపు: గవర్నర్ ఆమోదంపై ఉత్కంఠ
ఒడిశా శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) జీతాలు, అలవెన్సులు మూడు రెట్లు పెంచే బిల్లులు రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి నిర్ణయంపై నిలిచింది. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా?లేక ఆ బిల్లును ఆపి ఉంచుతారా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 9న శాసనసభ నాలుగు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే సభలో ఉన్న ఏకైక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఎమ్మెల్యేల జీతాల పెంపును వామపక్ష పార్టీ వ్యతిరేకించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఎమ్మెల్యేకు నెలకు లభించే మొత్తం ప్యాకేజీ రూ.1.11 లక్షల నుంచి రూ.3.45 లక్షలకు పెరిగింది. ముఖ్యమంత్రి నెల జీతం రూ.3.74 లక్షలు కాగా, ఉప ముఖ్యమంత్రులకు రూ.3.68 లక్షలు లభించనున్నాయి.
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. 2024–25లో ఒడిశా రాష్ట్ర తలసరి వార్షిక ఆదాయం సుమారు రూ.1.83 లక్షలుగా అంచనా వేసిన నేపథ్యంలో, ప్రజల కంటే ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వార్షిక ఆదాయం సుమారు రూ.41.4 లక్షలకు చేరిందని విమర్శకులు పేర్కొన్నారు. ఒడిశాలో ఒక ఎమ్మెల్యే సగటు పౌరుడి కంటే 22 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంటే, ఒక సాధారణ ఒడియా వ్యక్తి ఏడాది సంపాదనను ఎమ్మెల్యే కేవలం రెండు వారాల్లోనే సంపాదిస్తున్నాడు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక పోస్టు వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తాను పెంచిన జీతాన్ని తీసుకోనని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హీకి లేఖ రాశారు. అయితే, బిల్లులు సభలో ఆమోదం పొందినప్పుడు బీజేడీ వాటికి మద్దతు ఇచ్చింది. ఈ ప్రకటనపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కేవీ సింగ్ దేవ్ దీనిని రాజకీయ నాటకంగా అభివర్ణించారు. బిల్లు చర్చ సమయంలో నవీన్ పట్నాయక్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? ఇప్పుడు జీతం వద్దంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
బీజేడీ డ్రామా చేస్తోంది:సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా
ప్రతిపక్ష నేతగా బిల్లుకు సమ్మతి ఇచ్చి, ఇప్పుడు జీతం వద్దనడం ప్రజలు అంగీకరించరు అని ఆయన అన్నారు. అలాగే నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం రూ.1 జీతంగా తీసుకున్నారని గుర్తు చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే బాబు సింగ్ మాత్రం తన పెరిగిన జీతాన్ని భువనేశ్వర్–ఏకమ్ర నియోజకవర్గంలో పేదలకు దానం చేస్తానని ప్రకటించారు.
మరోవైపు బీజేడీ ఎమ్మెల్యే గణేశ్వర్ బెహెరా నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని వ్యక్తిగతమైన, ఆదర్శప్రాయ నిర్ణయంగా అభివర్ణించారు. ఎమ్మెల్యేల జీతాల పెంపు డిమాండ్ 2018 నుంచే పెండింగ్‌లో ఉందని, ప్రజాప్రతినిధులు ఎదుర్కొనే ఒత్తిడిని విమర్శకులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పవిత్ర సౌంటా మాత్రం నవీన్ పట్నాయక్ ప్రకటనను రెండుముఖాల ధోరణిగా, రాజకీయ స్టంట్గా విమర్శించారు.నవీన్ పట్నాయక్ ధనిక కుటుంబానికి చెందినవారు. కానీ 147 మంది ఎమ్మెల్యేలలో చాలామంది సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. వారికి జీతం అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో గవర్నర్ పాత్ర కీలకమని రాజ్యాంగ నిపుణుడు మనస్ బెహెరా తెలిపారు.
బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయి. ఆయన ఆమోదం ఇవ్వవచ్చు లేదా తిరిగి శాసనసభకు పంపవచ్చు. సాధారణంగా బిల్లులకు ఆమోదం లభిస్తుంది. కానీ ఈ విషయంలో ఏమవుతుందో చూడాలని ఆయన అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రసన్న మిశ్రా కూడా గవర్నర్‌ను బిల్లుపై పునర్విచారణకు సూచించాలంటూ పౌరులు అభ్యర్థిస్తే తాను మద్దతిస్తానని ఎక్స్‌లో పోస్టు చేశారు.
డిసెంబర్ 9న శాసనసభ ఆమోదించిన బిల్లులు
• ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ సవరణ బిల్లు–2025
• స్పీకర్ జీతాలు, అలవెన్సుల సవరణ బిల్లు–2025
• డిప్యూటీ స్పీకర్ జీతాలు, అలవెన్సుల సవరణ బిల్లు–2025
• మంత్రుల జీతాలు, అలవెన్సుల సవరణ బిల్లు–2025 లను ఆమోదించింది.
