
ఒడిశాలో 11 మంది మావోయిస్టులు లొంగుబాటు
‘ఆపరేషన్ కగార్’ తేదీ ముంచుకొస్తున్న వేళ మావోయిస్టులు ఉద్యమాన్ని వదిలి వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అడవిబాటను వీడి ప్రధాన జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. తాజాగా ఒడిస్సా పోలీసుల ముందు ఆదివారం 11 మంది మావోయిస్టులు ఆయుధాలతోపాటు లొంగిపోయారు. వీరిలో రూ.22 లక్షల బహుమతి ఉన్న డివిజనల్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కలహాండీ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ వైబీ.ఖురానియా , యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అదనపు డీజీ సంజీబ్‌పాండా సమక్షంలో ఈ మావోయిస్టులు లొంగిపోయారు.
లొంగిపోయిన ఈ మావోయిస్టులు నిషేధిత సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన బన్సధారా–ఘుమ్సార్–నాగావళి (బీజీఎన్) డివిజన్ సభ్యులు. వీరిలో మహారాష్ట్రకు చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్‌పై రూ.22 లక్షల బహుమతి ఉంది. మిగతా 10 మంది ఛత్తీస్‌గడ్‌కు చెందినవారు. మొత్తం బృందంలో ఒక డీసీఎం, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, మరో ఐదుగురు పార్టీ సభ్యులు ఉన్నారు. వీరిపై కలిపి రూ.63 లక్షలకు పైగా బహుమతి ప్రకటించింది. లొంగిపోయిన మావోయిస్టులు 11 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వాటిలో ఒక ఏకే-47, ఒక ఇన్సాస్ రైఫిల్, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక 12 బోర్ గన్ ఉన్నాయి. భారీగా మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు–పునరావాస విధానం ప్రకారం ఆర్థిక సహాయం, వృత్తి శిక్షణ అందిస్తామని డీజీపీ ఖురానియా తెలిపారు. మొత్తం రూ.1.23 కోట్లకు పైగా పరిహారం అందుతుందని, ఆయుధాలకుగాను అదనంగా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
భద్రతా దళాల నిరంతర చర్యల వల్ల ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే నౌపడ, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి, కోరాఫూట్, బౌద్, బోలన్‌గిర్ జిల్లాలు మావోయిస్టు రహితంగా మారాయని పేర్కొన్నారు. మార్చి 31 నాటికి ఒడిశాను పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. అదనపు డీజీ సంజీవ్ పాండా మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 15 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని తెలిపారు. వీరిలో స్టేట్ కమిటీ సభ్యుడు సుక్రు సహా కొందరు కంధమాల్ జిల్లాలో దాక్కున్నారని చెప్పారు. కంధమాల్, కలహాండీ, రాయగడ సరిహద్దు ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ప్రత్యేక దళాల సహకారంతో ఆపరేషన్లు మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.
