
ఒడిశాలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం–హత్య
ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు నిందితుడి ఇంటిని కూల్చివేశారు. భద్రక్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ రౌట్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడిని జగతి సింగ్పూర్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిందితులకు చట్టప్రకారం కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎలా జరిగింది ఘటన?
చందబాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన బాలిక మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశారు. కొద్ది గంటలకే సాయంత్రం పొదల్లో బాలిక మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.
ఉద్రిక్తతలు, ఆందోళనలు
ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంగళవారం రాత్రే స్థానికులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం నిరసనలు మరింత తీవ్రతరం అయ్యాయి. చందబాలి ప్రాంతంలో మూడు చోట్ల రహదారులను దిగ్బంధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ఆందోళనకారులు ముట్టడించారు. నిందితుడి వివరాలు బయటకు రావడంతో రంపల్లి గ్రామంలోని అతని ఇంటిపై దాడి చేసి, పూర్తిగా కూల్చివేశారు.
ప్రతిపక్షాల బంద్ పిలుపు
ఈ ఘటనకు నిరసనగా బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు గంటల చందబాలి బ్లాక్ బంద్ కు పిలుపునిచ్చాయి. బీజేడీ ఎమ్మెల్యే బియోమకేశ్ రాయ్ ఘటనను తీవ్రంగా ఖండించారు. భువనేశ్వర్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదుట బీజేడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతలో విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ప్రభుత్వ స్పందన
డిప్యూటీ సీఎం ప్రావతి పరిదా మాట్లాడుతూ, ఈ కేసులో నిందితుడిని వేగంగా అరెస్ట్ చేశాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ, మహిళలపై నేరాలకు సంబంధించి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు.
దర్యాప్తు కొనసాగుతోంది
ఈస్ట్రన్ రేంజ్ డీఐజీ పినాక్ మిశ్రా తెలిపిన ప్రకారం, వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తుండగా, ఫోరెన్సిక్ బృందం శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసును తుదిపరిశీలన వరకు తీసుకెళ్తాం అని ఆయన అన్నారు.
స్థానికుల ఆరోపణలు
రోడ్డు పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో మద్యం, మత్తు పదార్థాలు విక్రయించడంతో నేరాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. స్పందించిన పోలీసులు ఆక్రమణల తొలగింపు ప్రారంభించినట్లు తెలిపారు. తహసీల్దార్ భబతోష్ మల్లిక్ అక్రమ దుకాణాలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు.
