Let's talk: editor@tmv.in
ఒడిశాలో ‘వందేమాతరం’ సామూహిక గానం

ఒడిశాలో ‘వందేమాతరం’ సామూహిక గానం

Pinjari Chand
13 జనవరి, 2026

బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ప్రసిద్ధ జాతీయ గీతం ‘వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా, సోమవారం ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సామూహిక గాన కార్యక్రమంలో 50 లక్షలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పాఠశాల, మాస్ ఎడ్యుకేషన్ శాఖ, అలాగే ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించాయి. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ ఆధీనంలోని విద్యాసంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. గతంలో‘వందేమాతరం’150 ఏళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కోరుతూ ఒడిశా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జాతీయ గీతాన్ని ఆలపించడమే కాకుండా, ఈ సందర్భంగా జాతీయ యువ దినోత్సవం పురస్కరించుకుని పాల్గొన్నవారందరూ ‘ఆత్మనిర్భర్ భారత్ – స్వదేశీ సంకల్పం’ ప్రతిజ్ఞను కూడా చేశారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యబంశీ సూరజ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఒక సమయం, అనేక ప్రదేశాలు; ఒకే స్పందన – దేశగీతం! ఇది నిజంగా చారిత్రక క్షణం. జాతీయ యువ దినోత్సవం రోజున, ‘వందేమాతరం’ రచనకు 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో దేశభక్తి స్వరం మారుమోగుతోందని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని విద్యాసంస్థలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి

ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలకు ఒకేసారి నిర్వహించారు. అనేక విద్యాసంస్థలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో పంచుకోగా, కొన్ని చోట్ల క్విజ్‌లు, ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించారు. భువనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో, ఉపకులపతి ప్రొఫెసర్ జగనేశ్వర్ దండపట్‌, పీజీ కౌన్సిల్ చైర్‌పర్సన్ మితాలి చినారా సమక్షంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి ‘వందే మాతరం’ను ఆలపించారు. అక్కడ కూడా ‘ఆత్మనిర్భర్ భారత్ – స్వదేశీ సంకల్పం’ ప్రతిజ్ఞను చేశారు. బలసోర్‌లోని ఫకీర్ మోహన్ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఒకరు మాట్లాడుతూ తాము సమూహంగా ‘వందే మాతరం’ను ఆలపించామని, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం, ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులు, సేవలను ఎంచుకోవడం, అలాగే దేశ స్వావలంబనకు తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు.