Let's talk: editor@tmv.in
ఒడిశాలో భారీ బంగారు నిల్వల గుర్తింపు

ఒడిశాలో భారీ బంగారు నిల్వల గుర్తింపు

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో భారీ స్థాయిలో బంగారు నిల్వలు ఉన్నట్లు రాష్ట్ర మంత్రి విభూతి భూషణ్ జెనా అధికారికంగా ప్రకటించారు. జిల్లాలోని మదనశి-కంజియా అనే ప్రాంతంలో సుమారు 1462.73 కిలోల బంగారం ఉన్నట్లు భారత భూగర్భ సర్వేక్షణ సంస్థ తన సర్వేలో గుర్తించింది. ఎమ్మెల్యే సంజలి ముర్ము అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను తెలిపారు. భారత భూగర్భ సర్వేక్షణ సంస్థ మయూర్‌భంజ్ జిల్లాలోని బంగిరిపోషి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ అన్వేషణ జరిగినట్లు మంత్రి అసెంబ్లీలో స్పష్టం చేశారు.

బంగారంతో పాటు రాగి నిల్వలు

ఈ అన్వేషణలో కేవలం బంగారం మాత్రమే కాకుండా, భారీ స్థాయిలో రాగి నిల్వలు కూడా బయటపడ్డాయి. మయూర్‌భంజ్ జిల్లాలో దాదాపు 17.06 మిలియన్ టన్నుల రాగి నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఇటు బంగారం, అటు రాగి వంటి విలువైన ఖనిజాలు లభించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మైనింగ్ రంగానికి ఎంతో కీలకం కానుంది.

గతంలో (సెప్టెంబర్ 2025లో) అందించిన సమాచారం ప్రకారం, ఒడిశాలోని ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన నిల్వలు ఉన్నాయి. దేవగఢ్ జిల్లాలోని అదాష్ ప్రాంతంలో 1,685 కిలోలు, అలాగే కియోంజర్ జిల్లాలోని గోపూర్ ప్రాంతంలో 311.07 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ అన్ని ప్రాంతాలను కలిపి చూస్తే రాష్ట్రంలో పసిడి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని తెలుస్తోంది.

పరిశోధన స్థాయి

ప్రస్తుతం ఈ మూడు ప్రధాన గోల్డ్ రిజర్వ్ బ్లాకుల్లో (మయూర్‌భంజ్, దేవగఢ్, కియోంజర్) జి2-స్థాయి అన్వేషణ పూర్తయింది. సాధారణంగా మైనింగ్ రంగంలో జి-2 స్థాయి అంటే ఖనిజం లభ్యతపై ప్రాథమిక అంచనాలు దాటి, దాని పరిమాణం, నాణ్యతపై స్పష్టమైన అవగాహన రావడం. దీని తర్వాత వాణిజ్యపరమైన మైనింగ్ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది.

పైన పేర్కొన్న ప్రధాన ప్రాంతాలే కాకుండా, ఒడిశాలోని మరికొన్ని జిల్లాల్లో కూడా పసిడి నిల్వలు చెల్లాచెదురుగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. సుందర్‌ఘర్, కోరాపుట్, మల్కన్‌గిరి, అంగుల్, సంబల్‌పూర్ వంటి జిల్లాల్లో కూడా బంగారం ఉనికి ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ ఆవిష్కరణలతో ఒడిశా భారతదేశపు ప్రధాన మైనింగ్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.