Let's talk: editor@tmv.in
ఒడిశాలో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్ యాక్షన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్

ఒడిశాలో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్ యాక్షన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్

Pinjari Chand
18 మార్చి, 2026

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ఉల్లఘించి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒడిశా కాంగ్రెస్ మంగళవారం కఠిన చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలు సోఫియా ఫిర్‌‌దౌస్‌, రమేశ్‌ జెన, దశరథి గోమాంగోలను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంగ్రెస్‌కు ద్రోహం చేసే వారు దేశాన్నే ద్రోహం చేస్తున్నట్టే అని పార్టీ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఈ సందర్బంగా ఒడిశా కాంగ్రెస్ మీడియా చైర్‌పర్సన్ అరవింద్ దాస్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేల చర్యలు పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని భావించి సమగ్రంగా పరిశీలించిన తర్వాతే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారి అర్హత రద్దు (డిస్‌క్వాలిఫికేషన్) కోసం అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ ఈ చర్యను ‘అనూహ్య ద్రోహం’గా అభివర్ణిస్తూ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిని ఎమ్మెల్యే పదవుల నుంచి అనర్హులుగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత రామచంద్ర కదం అసెంబ్లీ స్పీకర్ సురమ పదైకు లేఖ రాసి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అర్హత రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం స్పష్టమైన పార్టీ ద్రోహమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో వారు ఇక కాంగ్రెస్ శాసనసభ పక్షానికి చెందరని, అసెంబ్లీలో వారి సీటింగ్ ఏర్పాట్లు కూడా మార్చాలని కోరారు. పోలింగ్‌కు ముందు ప్రలోభాల నుంచి రక్షించేందుకు కాంగ్రెస్ తన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించినప్పటికీ, ఈ క్రాస్‌ ఓటింగ్ ఘటన చోటుచేసుకోవడం పార్టీకి గట్టి దెబ్బగా మారింది.

క్రాస్‌ ఓటింగ్‌ వల్లే స్వతంత్ర అభ్యర్థి విజయం

రాజ్యసభ నాల్గవ సీటుకు బిజేడీ అభ్యర్థి దత్తేశ్వర్‌‌ హోతకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, బిజేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్ వల్ల బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి దిలీప్‌రే విజయం సాధించారు. ఈ పరిణామంతో ప్రతిపక్షానికి ఒకే సీటు దక్కగా, బీజేపీ రెండు సీట్లను సులభంగా గెలుచుకుంది. మరో సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. రాజ్యసభకు ఎన్నికైనవారిలో బీజేపీకి చెందిన మన్మోహన్ సమల్, సుజీత్‌కుమార్ బిజేడీకి చెందిన సంతృప్త్‌ మిశ్రా , అలాగే స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్ ఉన్నారు. విజయం అనంతరం దిలీప్ రాయ్ పూరీ లోని శ్రీ జగన్నాథ్‌ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల మద్దతుతో తనకు విజయం సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్ మాఝీ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, ఇది సమృద్ధ ఒడిశా లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇక బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేల గైర్హాజరు కారణంగా ఎన్డీయే అన్ని ఐదు రాజ్యసభ సీట్లను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. అందులో 26 స్థానాలు ఏకగ్రీవంగా భర్తీ కాగా, మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.

హర్యానాలో బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు ఒకటి.. క్రాస్‌ ఓటింగ్ కలకలం

హర్యానాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సంజయ్‌బాటియా (బీజేపీ), కరమ్‌వీర్‌‌ సింగ్‌ బౌధ్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటిన తరువాత పూర్తవగా, ఓటు రహస్య ఉల్లంఘన ఆరోపణలు, క్రాస్‌ ఓటింగ్ వివాదాలతో ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా తొలి స్థానాన్ని సులభంగా గెలుచుకోగా, రెండో స్థానానికి జరిగిన పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి బౌధ్ స్వల్ప మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి సతీశ్‌నందల్‌పై విజయం సాధించారు. బౌధ్‌కు 28 ఓట్లు లభించగా, నందాల్‌కు 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీలో ఐఎన్‌ఎల్‌డీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య 88కి తగ్గింది. అనంతరం ఐదు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.వాటిలో నాలుగు కాంగ్రెస్‌కు, ఒకటి బీజేపీకి చెందినవి. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పార్టీ తీవ్రంగా స్పందిస్తూ, సంబంధిత సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయబ్‌ సింగ్‌ సైనీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్ చేశారు. వారి నాలుగు ఓట్లు చెల్లనివిగా మారాయి’ అని తెలిపారు. ఇక ప్రతిపక్ష నేత భూపిందర్‌‌సింగ్‌ హుడా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది, ఓట్ల దొంగతనం ఓడిపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మూడో అభ్యర్థికి ఓట్లు సమీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఓటు రహస్య ఉల్లంఘనపై ఇరు పార్టీలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపులో ఐదు గంటలకుపైగా ఆలస్యం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఈ విషయంపై ఎన్నికల సంఘానికి లేఖ రాసి, ఎన్నికల సమగ్రతను కాపాడాలని కోరారు.