Let's talk: editor@tmv.in
ఒడిశాలో కలకలం: మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు, నిలిచిపోయిన కార్యకలాపాలు

ఒడిశాలో కలకలం: మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు, నిలిచిపోయిన కార్యకలాపాలు

Dantu Vijaya Lakshmi Prasanna
7 ఫిబ్రవరి, 2026

ఒడిశా రాష్ట్రంలోని మూడు జిల్లా కోర్టులకు శుక్రవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కటక్, పూరీ, ఫుల్బానీ జిల్లా కోర్టులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు పేలుళ్లకు సంబంధించిన బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణాలను ఖాళీ చేయించి, సోదాలు నిర్వహించారు. ఈ హఠాత్ పరిణామంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు, ఫలితంగా న్యాయపరమైన పనులన్నీ నిలిచిపోయాయి.

గత నెలలో (జనవరి 8న) కూడా కటక్, దేవ్‌గఢ్, సంబల్‌పూర్ కోర్టులకు ఇలాంటి ఈమెయిల్స్ వచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య స్పందిస్తూ, న్యాయవాదులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇది గతంలో లాగే కేవలం బెదిరింపు చర్య మాత్రమే అయ్యుండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి.

ఒకేసారి మూడు కోర్టులకు ఇలాంటి ఈమెయిల్స్ పంపడం వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కటక్ కోర్టుకు రెండోసారి ఇలాంటి మెయిల్ అందడం విశేషం. మధ్యాహ్నం వరకు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, అయితే భద్రతా కారణ దృష్ట్యా సోదాలు కొనసాగిస్తున్నామని పూరీ ఎస్పీ ప్రతీక్ సింగ్ వెల్లడించారు.