
ఒడిదుడుకుల్లో రూపాయి
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి ఒక దశలో 95 మార్క్‌ను దాటి 95.22 వరకు పడిపోయింది. అయితే చివరికి కొంత కోలుకొని అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా 7 పైసల లాభంతో 94.78 వద్ద (తాత్కాలికంగా) ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకద్రవ్య మార్కెట్లో రూపాయి 93.62 వద్ద ప్రారంభమై 93.57 వరకు బలపడింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 128 పైసల లాభం. అయితే ఆ తర్వాత ఒత్తిడి పెరిగి చరిత్రలోనే అత్యల్ప ఇంట్రాడే స్థాయి 95.22 వరకు పడిపోయింది. గత శుక్రవారం రూపాయి 89 పైసలు పడిపోయి 94.85 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన డాలర్ వైపు మొగ్గుచూపడం రూపాయి బలహీనతకు కారణమైంది.
ముడిచమురు ధరలు పెరగడమూ..
ఫారెక్స్ విశ్లేషకుల ప్రకారం, డాలర్ సూచీ 100 పాయింట్లకు పైగా కొనసాగుతుండటం, అలాగే ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణంగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 114.97 డాలర్లకు చేరి 2.60 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు పడిపోయి 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 488.20 పాయింట్లు తగ్గి 22,331.40 వద్ద నిలిచింది. గత శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,367.30 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాలు వెల్లడించాయి.
అయితే దేశ ఆర్థిక మౌలిక పరిస్థితులు బలంగా ఉన్నాయని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే రూపాయి స్థిరంగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన తర్వాత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు 4.1 శాతం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూపాయి విలువపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
