
ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడు
కడప జిల్లాను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళిక రూపొందిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రా అయోధ్యకు భక్తులు, పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఒంటిమిట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఒక సరికొత్త ప్రతిపాదనను రూపొందించింది. ఈ ప్రాంతంలో 600 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని చెరువు మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ విగ్రహం ఒంటిమిట్టను దేశంలోనే అతి పెద్ద రాముడి విగ్రహ కేంద్రంగా నిలపడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
టీటీడీకి చేరిన నివేదిక
విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుల బృందం ఈ ప్రాజెక్ట్ కోసం రూపొందించిన నివేదికను టీటీడీకి సమర్పించింది. రాబోయే మూడు దశాబ్దాల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది. ఒంటిమిట్టలోని రామాలయం సమీపంలో ఉన్న చెరువు మధ్యలో ఈ భవ్యమైన విగ్రహాన్ని నిర్మించాలని టీటీడీ నిపుణుల బృందం సూచించింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే, చెన్నై-ముంబై రైలు మార్గం మధ్యలో ఉన్న ఈ చెరువులో కొలువయ్యే విగ్రహం దూరం నుంచి చూసే వారికి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
ఈ నిర్మాణం ఒంటిమిట్టకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాక, ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచనుంది. ఈ విగ్రహం ద్వారా ఒంటిమిట్ట జాతీయ స్థాయిలో పర్యాటక ఆకర్షణగా మారడంతో పాటు, రామభక్తులకు ఒక ప్రత్యేక గమ్యస్థానంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పటికే టీటీడీ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో, ఈ ప్రాంతం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా జరిగే కళ్యాణోత్సవం టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోంది.
ముఖ్యమంత్రి స్వయంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 365 రోజులు ఉచిత ప్రసాద వితరణను ప్రారంభించారు, అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ఒంటిమిట్టకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, 600 అడుగుల రాముడి విగ్రహం నిర్మాణం ఈ ప్రాంతాన్ని మరింత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
