
ఒంగోలు వైరల్ వీడియో.. భార్యను కట్టేసి కొట్టిన భర్త అరెస్ట్
ఒంగోలు జిల్లాలో భార్యపై అనుమానంతో ఒక భర్త చేసిన పైశాచిక దాడిని చూసి అయ్యో.. ఇదెక్కడి ఘోరం అనని నోరు లేదు. మొత్తానికి ఆ ఘటనలో పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒంగోలులో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె రెండు చేతులూ రెండు గుంజాలకు కట్టేసి బెల్టుతో చావబాదాడు. ఆమె ఏడుస్తూ రక్షించండి అంటూ చేసిన ఆర్తనాదాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆ వీడియో పోలీసుల వరకు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా తుర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన బాలాజీ తన భార్య రెండు చేతులు కట్టేసి బెల్టుతో దాడి చేశాడు. భర్త కొడుతున్న దెబ్బలకు బాధతో ఆ భార్య ఏడుస్తూ రక్షించండి అంటూ సాయం కోసం అర్థించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒంగోలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంటనే రంగంలోకి దిగారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు ప్రత్యేక బృందంగా ఏర్పడి బాధితురాలిని గుర్తించారు. వెంటనే ఆమెకు వైద్య సహాయం అందజేయడంతో పాటు బాధితురాలి భర్త బాలాజీ, అతడికి సహకరించిన మరొకరిని అరెస్టు చేశారు.
బాలాజీకి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, భార్యపై అనుమానం పెంచుకొని తరచూ కొడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓ బేకరిలో పని చేస్తున్న తన భార్యను ఈ నెల 13న రాత్రి మద్యం మత్తులో ఉన్న బాలాజీ తీవ్రంగా గాయపరిచాడు. బెల్టుతో ఇష్టానుసారం కొట్టడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. బాధితురాలి రోదనలు విన్న స్థానికులు మద్యం మత్తులో ఉన్న బాలాజీని అదుపు చేయలేకపోయారు. ఇదే సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. మొత్తానికి సోషల్ మీడియా సాయంతో ఒక మహిళకు దుర్మార్గుడైన భర్త నుంచి రక్షణ లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
