Let's talk: editor@tmv.in
ఒక రోజు సరదా పయనం

ఒక రోజు సరదా పయనం

T Venkata Ramana
5 అక్టోబర్, 2025

వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంటి పట్టునే కాకుండా, కనీసం ఒక్కరోజైనా బయటి ప్రపంచాన్ని చూసిరావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా నగర జీవితపు హడావిడి నుంచి కొద్దిసేపు దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరాలని ఆశిస్తారు. మన హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉదయం వెళ్లి సాయంత్రానికల్లా హాయిగా తిరిగి వచ్చేయగలిగే అద్భుతమైన పిక్నిక్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సౌందర్యం పురాతన చరిత్ర, సాహస క్రీడలు ఇలా అన్నింటినీ ఆస్వాదించేందుకు అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్‌కు 100-120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలు పండగ సెలవులు ముగిసినా, సాధారణ వీకెండ్‌లో అయినా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

అనంతగిరి కొండలు

హైదరాబాద్ నుండి సుమారు 79 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. పచ్చని ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి అనంతగిరి కొండలు స్వర్గం లాంటివి. ఈ పర్వత ప్రాంతం మొత్తం దట్టమైన పచ్చదనంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక ప్రశాంతమైన అనుభూతినిస్తుంది.

ట్రెక్కింగ్ ఆనందం

సాహస క్రీడలు ఇష్టపడేవారికి ఇదొక మంచి ప్రదేశం. కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ చల్లని వాతావరణాన్ని పరిసరాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కొండలు కేవలం అందానికే కాదు అనేక ఔషధ మొక్కలకు నిలయంగా కూడా ప్రసిద్ధి చెందాయి. ఒకే రోజులో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

కొలనుపాక జైన్‌ మందిరం

2వేల ఏళ్ల చరిత్ర కలిగిన కొలనుపాక జైన్ మందిరం హైదరాబాద్ నుండి సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. చరిత్రను, శిల్పకళా వైభవాన్ని ఇష్టపడేవారికి కొలనుపాక జైన్‌ మందిర్‌ తప్పక చూడవలసిన ప్రదేశం. సుమారు 2వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం నిర్మాణ శైలి అందరినీ కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా రిషభ, స్వామి నేమినాథ్, స్వామి మహావీరుడు విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఇక్కడి మహావీర్ విగ్రహాన్ని అరుదైన జెడ్ స్టోన్ తో నిర్మించడం ఈ ఆలయానికి ప్రత్యేకత. ఆలయ వాతావరణం శిల్పకళా నైపుణ్యం సందర్శకులకు అపారమైన ప్రశాంతతను కలిగిస్తాయి.

రాచకొండ కోట

హైదరాబాద్ నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో రాచకొండ కోట. నగరానికి అత్యంత చేరువలో ఉన్న చారిత్రక ప్రాంతం ఇది. 14వ శతాబ్దంలో రాళ్లతో నిర్మించిన ఈ కోట తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. చరిత్రతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ కోట గొప్ప ఎంపిక. ఇక్కడ పురాతన కట్టడాలు, గుహలు, దేవాలయాలు, అపురూపమైన శిల్ప కళాఖండాలను చూడవచ్చు. రాచకొండ పరిసరాల్లో ట్రెక్కింగ్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు చిట్టడవిలో కనువిందు చేసే నెమళ్లు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.

పోచారం వన్యప్రాణి అభయారణ్యం

హైదరాబాద్ నుండి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో వన్యప్రాణి అభయారణ్యం ఉంటుంది. అడవి ప్రయాణం వన్యప్రాణులంటే ఆసక్తి ఉన్నవారికి పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఒక ఉత్తేజకరమైన ప్రదేశం. ఈ అభయారణ్యంలో పక్షులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలతో సహా పలు జంతువులను వీక్షించే అవకాశం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సఫారీ వాహనాల్లో ప్రయాణిస్తూ జంతువులను దగ్గరగా చూడవచ్చు. ఇది చాలా భిన్నమైన అనుభూతినిస్తుంది. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ ఒక వన విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలకు ఇది అద్భుతమైన విజ్ఞానాన్ని అందించే ట్రిప్ అవుతుంది.

ఈ ప్రదేశాలు కేవలం హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటమే కాకుండా, పర్యాటకులకు చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత, సాహసం అనే నాలుగు భిన్నమైన అనుభూతులను అందిస్తాయి. సో ఆలస్యం చేయకుండా మీ వీకెండ్‌ను ప్లాన్ చేసుకోండి. ఉదయం మీ ప్రయాణాన్ని ప్రారంభించి సాయంత్రం తిరిగి వచ్చే ఈ వన్-డే టూర్ మీ మనసుకు శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

ఒక రోజు సరదా పయనం - Tholi Paluku