
‘ఒక దేశం–ఒకే ఎన్నికలు’ అమలుపై పని కొనసాగుతోంది: ప్రధాని మోడీ
బీజేపీ 47వ స్థాపన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మాట్లాడుతూ ‘ఒక దేశం–ఒకే ఎన్నికలు’ యూసీసీ అమలుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఈ అంశాల్లో మంచి పురోగతి సాధించామని తెలిపారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళ రిజర్వేషన్ బిల్లు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.దేశంలో వివాహం, దత్తత వంటి అంశాల్లో మతభేదం లేకుండా ఒకే విధమైన చట్టాలు ఉండేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం లక్ష్యమని ఆయన వివరించారు. అలాగే ‘ఒక దేశం–ఒకే ఎన్నికలు’ విధానంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు.
బీజేపీ అనేక కీలక నిర్ణయాలను అమలు చేసిందని మోడీ పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి పలు చట్టాలను రద్దు చేయడం, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, సాధారణ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్, త్రిపుల్ తలాక్ నిషేధం, సీఏఏ అమలు, అయోధ్య నిర్మాణం వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని 1994లోనే బీజేపీ ముందుకు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నెరవేర్చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రతి దేశంతో సత్సంబంధాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు జరుగుతున్నప్పటికీ భారత్ ‘వసుధైవ కుటుంబం’ భావనను నమ్ముతుందని ఆయన అన్నారు. గతంలో భారత్ ఇతర దేశాల నుంచి సమదూరం పాటించేదని, ఇప్పుడు ప్రతి దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఎన్డీయే 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మాట్లాడిన మోడీ, దేశ ప్రయోజనాల కోసం పని చేసే కూటమిగా నిలిచిందని అన్నారు. అదేవిధంగా జాతీయ భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై బీజేపీ ఎప్పటికీ ఒకే విధమైన దృక్పథంతో ఉందని తెలిపారు. సరిహద్దు భద్రత కోసం కొత్త సాంకేతికతలు ప్రవేశపెడుతున్నామని, సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ–కాశ్మీర్ దేశంతో పూర్తిగా కలిసిపోయిందని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడం బీజేపీ లక్ష్యమని, అదే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.
