Let's talk: editor@tmv.in
ఒకే దేశం.. ఒకే పన్ను

ఒకే దేశం.. ఒకే పన్ను

FL - SUNL
21 సెప్టెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం పన్నులకు సంబంధించి తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకెంతో ప్రయోజనకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలోని రాక్ డైల్ హోటల్‌లో మాధవ్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రీఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో సరళీకృతమైన పన్ను విధానాల‌ను అమలు చేస్తూ ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు స్లాబ్‌ల‌ నుంచి రెండు స్లాబ్‌లకు తగ్గించడం జరిగిందన్నారు. ఈ కొత్త జీఎస్టీ విధానంతో దేశంలోని 140 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త పన్ను విధానాలు అమల్లోకి రాబోతున్నాయని దేశ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ధన్యవాదములు తెలిపారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్న సందర్భంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తీసుకొస్తున్న సంస్కరణలు దేశాన్ని కాపాడుతున్నాయని మాధవ్ పేర్కొన్నారు. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న‌ ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ప్ర‌థ‌మ‌ స్థానంలో ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం సైనిక, ఆర్థిక, మౌళిక‌, విమానయాన, రైల్వే, వ్యవసాయ, పారిశ్రామిక, ఔషధ తయారీ రంగాల్లో అత్యున్నత ప్రతిభ చూపుతూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంద‌న్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ఏయే ఉత్పత్తులపై, ఎంత శాతం ధరలు తగ్గనున్నాయ‌నే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఒకే దేశం.. ఒకే పన్ను - Tholi Paluku