Let's talk: editor@tmv.in
“ఒక టీకా - ఒక పరీక్ష - ఆరోగ్య భవిష్యత్తు”

“ఒక టీకా - ఒక పరీక్ష - ఆరోగ్య భవిష్యత్తు”

Dantu Vijaya Lakshmi Prasanna
3 మార్చి, 2026

గర్భాశయ ముఖ క్యాన్సర్… ఈ పేరు వినగానే చాలా మంది మహిళల్లో భయం, అనిశ్చితి కలుగుతాయి. కానీ వైద్య విజ్ఞానం స్పష్టంగా చెబుతున్న సత్యం ఏమిటంటే, ఈ క్యాన్సర్‌ను చాలా వరకు పూర్తిగా నివారించవచ్చు. సరైన సమయంలో హెచ్‌పీవీ టీకాలు, నియమిత స్క్రీనింగ్, త్వరిత చికిత్స ఉంటే లక్షలాది మహిళల ప్రాణాలు రక్షించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు ఈ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు కారణాలు, వ్యాప్తి, సామాజిక ప్రభావాలు, నివారణ మార్గాలు, చికిత్స, భారతదేశం, ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలపై విస్తృతంగా తెలుసుకుందాం…

గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటే ఏమిటి?

సాధారణంగా శరీరంలోని కణాలు నియంత్రితంగా పెరుగుతాయి.అయితే కొన్ని సందర్భాల్లో అవి మ్యూటేషన్‌కు లోనై నియంత్రణ లేకుండా వేగంగా విస్తరించి గడ్డ (ట్యూమర్)గా మారుతాయి. ఈ ప్రక్రియ గర్భాశయ ముఖంలోని (సర్విక్స్) కణాల్లో జరిగితే దాన్ని గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ ఉత్పత్తి చేసే మ్యూకస్ మహిళల సంతానోత్పత్తికి అవసరం. ఈ సర్విక్స్‌పై హ్యూమన్ పాపిల్లోమా వైరస్ దీర్ఘకాలిక సంక్రమణ జరిగితే ట్యూమర్ ఏర్పడి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ట్యూమర్లు బెనైన్ (క్యాన్సర్ కానివి), మాలిగ్నెంట్ (క్యాన్సర్ గడ్డలు)గా ఉంటాయి. మాలిగ్నెంట్ ట్యూమర్లు చికిత్స లేకపోతే వేగంగా పెరిగి ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి (మెటాస్టాసిస్), అయితే బెనైన్ ట్యూమర్లు ఇతర అవయవాలకు వ్యాపించవు.

మహిళల గర్భాశయంలో దిగువ భాగాన్ని సర్విక్స్ అంటారు. ఈ భాగంలో అసాధారణ కణాలు ఏర్పడి, కాలక్రమేణా అవి క్యాన్సర్‌గా మారితే దాన్ని గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటారు. సాధారణంగా ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. 15నుంచి20 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తగ్గిన మహిళల్లో, ముఖ్యంగా హెచ్ఐవీతో జీవిస్తున్నవారిలో, ఈ ప్రక్రియ వేగంగా జరిగి 5–10 సంవత్సరాల్లోనే క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది.

గర్భాశయ ముఖ క్యాన్సర్‌లో సర్విక్స్ నిర్మాణం ఎండోసర్విక్స్ ఎక్సోసర్విక్స్ అనే రెండు భాగాలుగా ఉంటుంది. ఎండోసర్విక్స్‌లో కాలమ్నర్ గ్రంధి ఎపితీలియం ఉండగా, ఎక్సోసర్విక్స్‌లో స్క్వామస్ ఎపితీలియం ఉంటుంది. ఈ ఆధారంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రధానంగా రెండు రకాలుగా కనిపిస్తుంది. వాటిలో అత్యంత సాధారణమైనది స్క్వామస్ సెల్ కార్సినోమా, ఇది ఎక్సోసర్విక్స్‌ను కప్పి ఉండే స్క్వామస్ కణాల్లో ఏర్పడుతుంది. మరో రకం అడెనోకార్సినోమా, ఇది సుమారు 20 శాతం కేసుల్లో కనిపించి, ఎండోసర్విక్స్‌లోని గ్రంధి కణాల్లో ఏర్పడుతుంది. ఇవి కాకుండా, చాలా అరుదుగా లింఫోమాలు, సార్కోమాలు, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లు వంటి ఇతర హిస్టాలజికల్ రకాల గర్భాశయ ముఖ క్యాన్సర్లు కూడా గుర్తించబడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి

2022 గణాంకాల ప్రకారం, గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఆ ఏడాదిలో సుమారు 6.6 లక్షల కొత్త కేసులు, 3.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ మరణాల్లో 94 శాతం కేసులు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే చోటు చేసుకున్నాయి. సహారా దక్షిణ ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణ–తూర్పు ఆసియా వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు, టీకాలు, స్క్రీనింగ్, చికిత్స సేవలకు సరైన ప్రాప్యత లేకపోవడం, పేదరికం, లింగ అసమానతలు, ఆరోగ్య అవగాహన లోపం.

హెచ్‌పీవీ - అసలు మూల కారణం

గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే సాధారణ వైరస్. లైంగికంగా చురుకుగా ఉన్న వ్యక్తుల్లో చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి హెచ్‌పీవీ సోకుతుంది. సాధారణంగా శరీర రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్‌ను సహజంగానే తొలగిస్తుంది. కానీ కొన్ని అత్యంత ప్రమాదకరమైన హెచ్‌పీవీ రకాల (ప్రధానంగా 16, 18)తో దీర్ఘకాలిక సంక్రమణ కొనసాగితే, సర్విక్స్‌లో అసాధారణ కణాలు ఏర్పడి, అవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి, సుమారు 95 శాతం గర్భాశయ ముఖ క్యాన్సర్లు హెచ్‌పీవీ వల్లే సంభవిస్తాయి.

హెచ్ఐవీతో జీవిస్తున్న మహిళలకు ఎక్కువ ప్రమాదం

హెచ్ఐవితో జీవిస్తున్న మహిళలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల హెచ్‌పీవీ వైరస్ శరీరంలో ఎక్కువకాలం ఉండి, కణాల మార్పును వేగవంతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ కేసుల్లో సుమారు 5 శాతం హెచ్ఐవికు సంబంధించినవిగా అంచనా వేయబడుతున్నాయి. అందుకే ఈ మహిళలకు త్వరగా, తరచుగా స్క్రీనింగ్ చేయడం అత్యంత అవసరం.

గర్భాశయ ముఖ క్యాన్సర్ ఎక్కువగా యువ మహిళలను ప్రభావితం చేస్తుంది. తల్లి మరణం అంటే కుటుంబానికి, పిల్లలకు తీరని లోటు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నదేమిటంటే, క్యాన్సర్ కారణంగా తల్లిని కోల్పోయే పిల్లల్లో 20 శాతం మంది పిల్లలు గర్భాశయ ముఖ క్యాన్సర్ వల్లే తల్లిని కోల్పోతున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు. ఇది సామాజిక, ఆర్థిక సమస్య కూడా.

నివారణే ప్రధాన ఆయుధం

ఈ క్యాన్సర్ విషయంలో అత్యంత ఆశాజనక విషయం ఏమిటంటే నివారణ సాధ్యమే. సరైన వ్యూహాలతో దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు.

హెచ్‌పీవీ టీకాలు

9–14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇవ్వడం అత్యంత ప్రభావవంతమైన నివారణ చర్య. టీకాలు హెచ్‌పీవీ 16, 18 రకాల నుంచి రక్షణ ఇస్తాయి. ఇవి సుమారు 76 శాతం క్యాన్సర్లకు కారణం. కొన్ని దేశాల్లో బాలురికీ టీకాలు ఇస్తున్నారు. సమాజంలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఈ ప్రయత్నం.

సర్వికల్ స్క్రీనింగ్

30 ఏళ్ల నుంచి మహిళలు ప్రతి 5నుంచి10 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. హెచ్ఐవితో జీవిస్తున్న మహిళలు 25 ఏళ్ల నుంచే, ప్రతి 3నుంచి5 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ ద్వారా ప్రీ-క్యాన్సర్ దశలోనే సమస్యను గుర్తించి చికిత్స చేయవచ్చు.

అవగాహన, ఆరోగ్య విజ్ఞానం

పొగతాగడం మానేయడం, కండోముల వినియోగం, లైంగిక ఆరోగ్యంపై అవగాహన ఇవన్నీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. హెచ్‌పీవీ పరీక్ష కోసం మహిళలు తామే నమూనా సేకరించుకోవడం ఇప్పుడు సాధ్యమైంది. పరిశోధనలు చూపించినట్లుగా, ఇది ఆరోగ్య సిబ్బంది సేకరించే నమూనాలంతే నమ్మకమైనది. గ్రామీణ ప్రాంతాలు, సంకోచం ఎక్కువగా ఉన్న సమాజాల్లో ఇది మహిళలకు పెద్ద ఊరట.

చికిత్స - ముందే గుర్తిస్తే సులువు

ప్రీ-క్యాన్సర్ దశలో చికిత్స చాలా సులువు, తక్కువ సమయం పడుతుంది.

ప్రధాన చికిత్స పద్ధతులు

• థర్మల్ అబ్లేషన్ -వేడి ద్వారా అసాధారణ కణాల నాశనం

• క్రయోథెరపీ - చలితో నాశనం

• లీప్ /లీట్జ్ -విద్యుత్తుతో వేడెక్కిన లూప్ ద్వారా కణజాలం తొలగింపు

• కోన్ బయాప్సీ - శస్త్రచికిత్స ద్వారా కణజాలం తీసివేత

ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది.

లక్షణాలు - నిర్లక్ష్యం చేయకూడదు

కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నెలసరి మధ్యలో లేదా రజోనివృత్తి తర్వాత రక్తస్రావం. దుర్వాసనతో కూడిన యోని స్రావం. వెన్ను, కాళ్లు, పెల్విస్‌లో నిరంతర నొప్పి. బరువు తగ్గడం, అలసట, కాళ్ల వాపు వంటి సమస్యలు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 90–70–90 లక్ష్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. 90శాతం బాలికలకు 15 ఏళ్లలోపు వారికి హెచ్‌పీవీ టీకాలు ఇప్పించడం, 70శాతం మహిళలకు 35 నుంచి 45 ఏళ్లలో స్క్రీనింగ్ చేయించడం, 90శాతం ప్రీ-క్యాన్సర్ లేదా క్యాన్సర్ ఉన్న మహిళలకు అత్యవసర చికిత్స ఇవ్వడం. ఈ లక్ష్యాలు సాధిస్తే, 2120 నాటికి 7.4 కోట్ల కొత్త కేసులు, 6.2 కోట్ల మరణాలు నివారించవచ్చని అంచనా.

భారతదేశం - కీలక అడుగు

భారతదేశం జాతీయ స్థాయిలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక అడుగు. ఇది దేశంలోని కోట్లాది బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. భారతదేశం వంటి జనాభా అధిక దేశంలో ఈ చర్య ప్రపంచ స్థాయిలోనే ప్రభావం చూపిస్తుంది.

ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మేర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవి) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలో మహిళల ఆరోగ్య రక్షణలో, ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలకు ఈ టీకా ద్వారా భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ కల్పించనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, హెచ్‌పీవి టీకా కార్యక్రమం భారతదేశంలోని ‘నారీ శక్తి’ని మరింత బలపరిచే కీలక చర్యగా పేర్కొన్నారు. “ఒక కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు. తల్లి అనారోగ్యానికి గురైతే ఇంటి మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ భావనతోనే మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది,” అని అన్నారు.

గర్భాశయ క్యాన్సర్ భారత్‌లో మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబోకాన్ 2022 నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 1.2 లక్షల కొత్త కేసులు, దాదాపు 80 వేల మరణాలు నమోదవుతున్నాయి. హెచ్‌పీవి వైరస్‌లోని 16, 18 వంటి అధిక ప్రమాదకర రకాలతో దీర్ఘకాలిక సంక్రమణే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని వైద్య పరిశోధనలు స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలోనే హెచ్‌పీవి టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది. దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత జాతీయ టీకాల సాంకేతిక సలహా బృందం ఈ టీకాను సిఫార్సు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలు తమ జాతీయ టీకా కార్యక్రమాల్లో హెచ్‌పీవి టీకాను అమలు చేస్తున్నాయి.

భారత్‌లో ఈ కార్యక్రమం కింద గార్డాసిల్-4 (హెచ్‌పీవి రకాలు 6, 11, 16, 18) టీకాను ఒకే డోసుగా అందించనున్నారు. ఈ క్యాంపెయిన్ 90 రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం సాధారణ టీకా దినాల్లో కూడా ఈ టీకా అందుబాటులో ఉంటుంది. టీకా పూర్తిగా ఉచితం, అలాగే తల్లిదండ్రుల అనుమతితోనే ఇవ్వబడుతుంది.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలలో మాత్రమే ఈ టీకా అందిస్తారు. లబ్ధిదారులు యు-విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు లేదా నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లవచ్చు. ప్రతీ టీకా సెషన్‌లో భద్రత, శీతలీకరణ యంత్రాల నిర్వహణ, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి.

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ హెచ్‌పీవి టీకా కార్యక్రమం భారతదేశంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణకు ఒక కొత్త దిశను చూపిస్తోంది. 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది.

ప్రపంచ గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ప్రపంచ గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు మహిళలు, బాలికల ఆరోగ్య హక్కులపై దృష్టి సారిస్తుంది. టీకాలు, స్క్రీనింగ్, చికిత్స, ఈ మూడు స్తంభాలపై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

గర్భాశయ ముఖ క్యాన్సర్ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించబడింది. కానీ నేడు ఇది నివారించగలిగే, నియంత్రించగలిగే వ్యాధి. ప్రభుత్వాల కట్టుబాటు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, సమాజ అవగాహన, ఈ మూడు కలిసి పనిచేస్తే గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను ప్రజారోగ్య సమస్యగా చరిత్రలో కలిపేయవచ్చు.

ఒక టీకా, ఒక పరీక్ష, ఒక అవగాహన సందేశం, ఒక మహిళ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది.