Let's talk: editor@tmv.in
ఒక గంటలో 847 పుష్‌అప్స్‌

ఒక గంటలో 847 పుష్‌అప్స్‌

Pinjari Chand
10 నవంబర్, 2025

ఫిట్‌ ఇండియా అంబాసిడర్‌, పుష్‌ అప్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి పొందిన రోహితాష్‌ చౌదరీ భారత ఫిట్‌నెస్‌ స్ఫూర్తిని మరోసారి చాటాడు .ఒక గంటలో బ్యాక్ ప్యాక్ తో 60 పౌండ్ల (27 కిలోల) బరువుతో 847 పుష్‌ అప్స్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఈ అద్భుత విజయంతో రోహితాష్‌ సిరియాకు చెందిన సమీ జొమహ్ హస్సన్ అనే వ్యక్తి పేరుమీద ఉన్న 820 పుష్‌ అప్స్‌ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర రాశాడు. ఈ రికార్డును 2023 ఫిబ్రవరి 6న డమాస్కస్ లో సాధించారు. రోహితాష్‌ ఈ ఘనతను ఆయన ఆదివారం న్యూఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సాధించాడు. గిన్నిస్‌ అధికారిక ధృవీకరణ బృందం హాజరై రికార్డును ఆన్-సైట్ లో ధృవీకరించింది. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, ఫిట్‌ ఇండియా ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ చొరవతో ఫిట్ ఇండియా ఉద్యమం పేరుతో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మానసుఖ్‌ మాండవీయా పాల్గొని రోహితాష్‌ను అభినందించారు.

ఫిట్‌ ఇండియా స్ఫూర్తికి ప్రతిరూపం: మాండవీయా

రోహితాష్‌ చౌధరీ ఫిట్‌ ఇండియా స్ఫూర్తికి ప్రతిరూపం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలుగన్న ఫిట్‌, బలమైన, ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు ఆయన ముందుకు సాగుతున్నారు అని మంత్రి అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ లో పాల్గొన్న మన సైనికులకు అంకితంగా ఈ కృషి చేసిన రోహితాష్‌ భారత యువతకు ఆదర్శంగా నిలిచాడని ఆయన ప్రశంసించారు.

సైనికులకే అంకితం చేస్తున్నా:రోహితాష్‌

తన విజయం తర్వాత భావోద్వేగానికి లోనైన రోహితాష్‌ మాట్లాడుతూ నవంబర్ 2024లో, నేను 704 వన్-లెగ్ పుష్-అప్‌ల రికార్డును మా ప్రధానమంత్రికి అంకితం చేశాను. ఈ రోజు నేను ఈ కొత్త రికార్డును మన సాయుధ దళాలకు, ఆపరేషన్ సింధూర్‌కు అంకితం చేస్తున్నాను. ఇది మన దేశ బలం, క్రమశిక్షణ, ఐక్యతను సూచిస్తుంది. నిరంతర ప్రేరణ, మద్దతుగా నిలబడినందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమాన్ని చేపట్టాలని తద్వారా కాలుష్యరహిత, ఆరోగ్యవంతమైన భారతం వైపు సామాజిక ఉద్యమంగా మారిందన్నారు. యువత ఫిట్‌నెస్‌ను జాతీయ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కిక్కిరిసిపోయిన స్టేడియం

ఈ రికార్డు ప్రయత్నం సందర్భంగా వేలాది మంది విద్యార్థులు, ఫిట్‌నెస్‌ అభిమానులు , ఫిట్‌ ఇండియా అంబాసిడర్లు స్టేడియాన్ని కిక్కిరిసిపోయేలా చేశారు.

రోహితాష్‌ ప్రతీ పుష్‌అప్‌కి జనసందోహం ‘జై హింద్‌’ అంటూ గర్జిస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఈ విజయంతో భారత ఫిట్‌నెస్‌ స్ఫూర్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన రోహితాష్‌ చౌదరీపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఫిట్‌ ఇండియా మిషన్‌ ఆధ్వర్యంలో యువతకు ప్రేరణగా నిలిచిన ఆయన పేరు ఇప్పుడు గిన్నిస్‌ పుస్తకంలో చేరింది.