Let's talk: editor@tmv.in
ఒక కచోరీ, ఓ సమోసా... గ్యాస్‌పై నమ్మకం పోయింది: అఖిలేశ్‌ యాదవ్

ఒక కచోరీ, ఓ సమోసా... గ్యాస్‌పై నమ్మకం పోయింది: అఖిలేశ్‌ యాదవ్

Pinjari Chand
27 మార్చి, 2026

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తల మధ్య అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై భారంగా మారాయని, ముఖ్యంగా పీడీఏ (పిచ్చడే, దళిత్, అల్పసంఖ్యాక వర్గాలు) తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రజలకు ఇచ్చింది ఒక్కటే అవి లైన్లు. వాళ్ల ప్రతి నిర్ణయం ప్రజలను క్యూలో నిలబెడుతోంది. అయితే ఈసారి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు… అదే లైన్లో నిలబడి వారిని ఓడిస్తారని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరలపై వ్యంగ్యంగా స్పందిస్తూ ఒక కచోరీ, ఒక సమోసా… ఇప్పుడు గ్యాస్‌పై నమ్మకం లేదంటూ ఎల్పీజీని ‘లపాటా గ్యాస్’గా అభివర్ణించారు. బీజేపీ సామాజిక సమస్యలను అర్థం చేసుకోలేదని విమర్శిస్తూ ఏఐ అంటే ఏమిటో తెలియని వారు, పీడీఏ సమస్యలను ఎలా అర్థం చేసుకుంటారు? వారి బాధలు, అవమానాలను ఎలా గ్రహిస్తారు? అని ప్రశ్నించారు. పీడీఏ వర్గాల కష్టాలు పెరిగే కొద్దీ, వారి ఐక్యత కూడా పెరుగుతుందని అన్నారు. సమాజవాదీ పార్టీ పీడీఏ వర్గాలను ఐక్యం చేసే దిశగా పని చేస్తోందని ఆయన తెలిపారు. పీడీఏ ప్రజలకు గౌరవం తీసుకురావడం కోసం మేం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రచార వ్యూహాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇతరుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసే పార్టీ ఇదే కావచ్చు. ప్రజలు ప్రశంసలు పాడేలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అవి ఆగితే ప్రశంసలు కూడా ఆగిపోతాయి (దానా ఖతమ్ తో గానా ఖతమ్) అని అన్నారు.

అధికారంలోకి వస్తే రూ.40 వేలు ఆర్థిక సాయం

ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే, సమాజవాదీ పార్టీ అధికారంలోకి వస్తే పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. సమాజవాదీ పెన్షన్ పునరుద్ధరణ, ల్యాప్‌టాప్‌ల పంపిణీ, పేద కుటుంబాలకు రూ.40,000 ఆర్థిక సహాయం వంటి పథకాలు చేపడతామని వెల్లడించారు. అలాగే ‘సమ్మాన్ సమృద్ధి యోజన‘, ‘స్త్రీ సమ్మాన్ యోజన’లను ప్రారంభిస్తామని చెప్పారు. మహిళల రిజర్వేషన్‌పై స్పందిస్తూ, మహిళలకు రిజర్వేషన్ ఉండాలని, అదే సమయంలో వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు తమ హక్కులు పొందాలని పార్టీ అభిప్రాయమని తెలిపారు. తమ సూచనలు కేంద్రానికి తెలిపామని, వాటిని ప్రభుత్వం స్వీకరించాలా లేదా అనేది వారి నిర్ణయమని అన్నారు. ఆ ఆధారంగా పార్టీ తన తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ములాయం సింగ్‌ యాదవ్‌ సూచించిన మార్గంలోనే పార్టీ కొనసాగుతోందని పేర్కొంటూ ఎవరి హక్కులను దోచుకోవడం మా లక్ష్యం కాదు. అన్ని వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా హక్కులు, గౌరవం రావాలని స్పష్టం చేశారు. చివరగా, సమాజవాదీ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, శుభాకాంక్షలు, మద్దతు పెరుగుతోందని అఖిలేష్ యాదవ్ తెలిపారు.