Let's talk: editor@tmv.in
ఒకే వేదికపైకి భూభారతి, భూసర్వే, సబ్ రిజిస్ట్రార్ విభాగాలు: మంత్రి పొంగులేటి

ఒకే వేదికపైకి భూభారతి, భూసర్వే, సబ్ రిజిస్ట్రార్ విభాగాలు: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
6 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 94 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు దశల్లో శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు.

ఇందులో తొలి దశగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 కార్యాలయాలను 11 సమీకృత క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాంతాల నుంచే రాష్ట్రానికి వచ్చే రిజిస్ట్రేషన్ ఆదాయంలో సుమారు 69 శాతం వస్తుండటం విశేషమని ఆయన చెప్పారు. ఈ నెలలోనే 10 ఆధునిక సబ్-రిజిస్ట్రార్ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రైవేట్ బిల్డర్ల ద్వారా ఈ భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న కార్యాలయాలను అన్ని హంగులతో ఆధునీకరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయం గణనీయంగా తగ్గిందని, ఇప్పుడది కేవలం 18 నుంచి 21 నిమిషాలకు పరిమితమైందని మంత్రి తెలిపారు. దీని వల్ల ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, పౌరహిత సేవలు అందుతున్నాయని ఆయన అన్నారు.

భూభారతి, భూసర్వే, సబ్-రిజిస్ట్రార్ విభాగాలను ఒకే ఫ్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో భూసంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ వ్యవస్థను రాబోయే మూడు లేదా నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలతో భూ పరిపాలనలో సమగ్ర మార్పులు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒకే వేదికపైకి భూభారతి, భూసర్వే, సబ్ రిజిస్ట్రార్ విభాగాలు: మంత్రి పొంగులేటి - Tholi Paluku