
ఒకేఒక్కడు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని ఫోర్ కొట్టడం ద్వారా 'హిట్‌మ్యాన్' ఈ ఘనతను అందుకున్నాడు. ఇది ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో రోహిత్ ఆడిన 21వ వన్డే కావడం విశేషం.
రికార్డుల హోరు
రెండో వన్డేలో రోహిత్ శర్మ (73 పరుగులు, 97 బంతుల్లో) అద్భుతమైన అర్ధ సెంచరీతో రాణించి, పలు మైలురాళ్లను అధిగమించాడు. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1000 పరుగులు సాధించిన సాధించిన ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచారు. కేవలం 21 ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరుకుని, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న జాబితాలో వివ్ రిచర్డ్స్ (19 ఇన్నింగ్స్‌లు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (1000 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (802 పరుగులు), సచిన్ టెండూల్కర్ (740 పరుగులు), ఎం.ఎస్. ధోని (684 పరుగులు) ఉన్నారు.
వన్డేల్లో ఓపెనర్‌గా 9,180 పరుగులు చేసి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9,146) రికార్డును కూడా రోహిత్ శర్మ అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,310) అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం వన్డే కెరీర్‌లో 11,225 పరుగులు పూర్తి చేసి, సౌరవ్ గంగూలీ (11,221)ని వెనక్కి నెట్టి రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియాపై వన్డేల్లో 18 హాఫ్ సెంచరీలు సాధించి, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా రికార్డును సమం చేశాడు.
కోహ్లీ డకౌట్, రోహిత్-శ్రేయస్ భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9)తో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) ఒకే ఓవర్‌లో (గ్జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో) ఔటయ్యారు. అయితే, క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ కీలకమైన 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. కాగా విరాట్ కోహ్లీ తన 17 ఏళ్ల వన్డే కెరీర్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి.
