Let's talk: editor@tmv.in
ఒకరోజు హిజాబ్ ధరించిన కుమార్తె భారత్‌కు ప్రధాని అవుతుంది: అసదుద్దీన్ ఓవైసీ

ఒకరోజు హిజాబ్ ధరించిన కుమార్తె భారత్‌కు ప్రధాని అవుతుంది: అసదుద్దీన్ ఓవైసీ

Pinjari Chand
11 జనవరి, 2026

భారత రాజ్యాంగం సమగ్రతను, సమానత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఒక రోజు హిజాబ్ ధరించిన కుమార్తె భారతదేశ ప్రధాని అవుతుందని తన కలగా పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన ఓవైసీ, పాకిస్తాన్ రాజ్యాంగంతో భారత రాజ్యాంగాన్ని పోల్చుతూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకే మతానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ దేశ ప్రధాని కావచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని ఏ పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు. హిజాబ్ ధరించిన ఒక కుమార్తె ఈ దేశానికి ప్రధాని అయ్యే రోజు రావాలని నేను కలగంటున్నానని ఓవైసీ అన్నారు. ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నవారు అంతిమంగా అంతమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలపై మీరు వ్యాపింపజేస్తున్న ద్వేషం ఎక్కువ కాలం నిలవదు. ద్వేషం వ్యాప్తి చేసే వారు ముగిసిపోతారు. ప్రేమ సాధారణమయ్యే రోజు, ప్రజల మనసులను ఎలా విషపూరితం చేశారో వారికి అర్థమవుతుందని అన్నారు.

ఎఐఎంఐఎం అధ్యక్ష్యురాలిగా మహిళను చేయండి

ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహాజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందని మియాన్ ఓవైసీ అంటున్నారు. రాజ్యాంగం ఎవరికీ అడ్డంకి కాదు. కానీ ముందు మీ పార్టీ ఎఐఎంఐఎం అధ్యక్షురాలిగా ఒక పష్​మాండా ముస్లింని లేదా హిజాబ్ ధరించిన మహిళను నియమించండి అని నేను సవాల్ చేస్తున్నానని పూనావాలా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంతకు ముందు, కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం పై ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లో కఠిన నిబంధనలను చేర్చడం వల్ల అనేక మంది అండర్‌ ట్రయల్ ఖైదీలు దీర్ఘకాలంగా జైలులోనే ఉండిపోతున్నారని అన్నారు. ఇందులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ వంటి పండితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదో వివరించింది. యూపీఏ ప్రభుత్వంలో యూఏపీఏ చట్టాన్ని సవరించి ఉగ్రవాదానికి విస్తృత నిర్వచనం చేర్చారు. కాంగ్రెస్ రూపొందించిన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారని నేను అప్పుడే హెచ్చరించాను. అదే ఆధారంగా ఐదున్నరేళ్లుగా ఇద్దరు యువకులు జైలులో ఉన్నా వారికి బెయిల్ లభించలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా ఐదున్నర సంవత్సరాలు జైలులో ఉన్నారా? అని ఓవైసీ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ముంబైలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీవ్రమైన ప్రచారం సాగుతున్న సమయంలో వచ్చాయి. ఈ ఎన్నికలు జనవరి 15న జరగనుండగా, ఫలితాలు జనవరి 16న వెలువడనున్నాయి.

ప్రధాని పదవికి ఖాళీ లేదు:షైనా

హిజాబ్ ధరించిన మహిళ ఒక రోజు భారతదేశ ప్రధాని అవుతారని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ప్రతినిధి షైనా ఎన్‌సీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ లేదని ఆమె వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన షైనా ఎన్‌సీ, నాయకత్వం అనేది కులం, మతం, సముదాయం ఆధారంగా కాకుండా, పనితీరు, ప్రజల నుంచి లభించే ప్రజాస్వామ్య మద్దతుపై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒక మహిళ ప్రధాని కావాలన్న ఆకాంక్ష తమకూ ఉందని, అయితే అది ప్రతిభ, మంచి పనితీరు ఆధారంగానే ఉండాలని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ గారూ, ప్రధాని పదవికి ప్రస్తుతం ఖాళీ లేదు. నరేంద్ర మోడీ ప్రజాదరణ అందరికీ తెలిసిందే. ముందుగా మీ పార్టీ నుంచి ఎంపీలు గెలిపించుకోండి, ఆ తర్వాత ప్రధాని గురించి కలలు కనండి. అవును ఒక దశలో మాకూ మహిళ ప్రధాని కావాలన్న కోరిక ఉంది. కానీ అది ఆమె కులం, మతం లేదా సముదాయం ఆధారంగా కాకుండా, ఆమె చేసిన మంచి పనులు, భారత ప్రజల ప్రజాదరణ ఆధారంగా ఉండాలని షైనా అన్నారు.