
ఒకరిద్దరి వల్ల వైసీపీ ఓడిందా ?
కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు ఉన్నట్టు.. వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సొంత పార్టీ నేతలే కారణమని వైసీపీ అధిష్టానం భావించడం పట్ల సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఓడిపోయామన్న వాదన అసంబద్ధంగా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బహిష్కరిస్తూ పోతే పార్టీ ఖాళీ అవ్వడం తప్పా ప్రయోజనం లేదన్నది సస్పెండ్ అయిన నేతల అభిప్రాయం.
2024 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో.. పార్టీ అధిష్టానం చాలా మంది నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అందులో ముఖ్యంగా రాప్తాడు, కదిరి, హిందూపురం నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గం నుంచి భూమిరెడ్డి మహానందిరెడ్డితో పాటు మరికొందరు నేతల్ని వైసీపీ సస్పెండ్ చేసింది. హిందూపురం నియోజకవర్గం నుంచి కీలక నేతలు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేసింది. కదిరి నియోజకవర్గం నుంచి విశ్వనాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది.
వీరంతా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థితో గత ఎన్నికల్లో విబేధించారు. విమర్శించారు. టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ అధిష్టానాన్ని అభ్యర్థించారు. కానీ పార్టీ అధిష్టానం ఎవరికి ఇవ్వాలని అనుకుందో వారికే టికెట్ ఇచ్చింది. స్థానిక నేతల అభిప్రాయాలను పట్టించుకోలేదు. దీంతో వీరంతా ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన టీడీపీ గాలిలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిపోయిన అభ్యర్థులు తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఫిర్యాదు చేయడంతో అధిష్టానం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణతో మహానందిరెడ్డి, విశ్వానాథ్ రెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ లాంటి కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన నేతలు తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, స్థానిక అభ్యర్థిని వ్యతిరేకించామని చెబుతున్నారు. సస్పెండ్ అయినా వైసీపీతోనే ఉన్నారు. వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. పార్టీ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ఎదురుచూస్తున్నారు. పార్టీలో విబేధాలు సహజం, నేతల మధ్య ఆధిపత్యపోరు సహజం. అంతమాత్రాన సస్పెండ్ చేసుకుంటూ వెళ్తారా అని ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో మిగిలేది నాయకులే తప్పా కార్యకర్తలు కాదన్న వాదన వినిపిస్తున్నారు. విబేధాలు ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. నచ్చజెప్పాలి. సయోధ్య కుదర్చాలి. అంతేకానీ సస్పెండ్ చేస్తారా అన్న ప్రశ్న వైసీపీలో వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మారకపోతే ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఒకరో, ఇద్దరో వ్యతిరేకంగా పనిచేస్తే ఓడిపోతారా ?. ప్రభుత్వ వ్యతిరేకత, మరికొన్ని నిర్ణయాలు కలగలిసి వైసీపీని ఓడించాయి. అంతేకానీ ఒకరిద్దరి మీద నెపం నెట్టడం ఏంటన్న వాదన వైసీపీలో ఉంది. ఒకరిద్దరి మీద నెపం నెట్టడం.. ఇప్పటికీ వైసీపీ ఎందుకు ఓడిపోయామో గుర్తించలేని స్థితిలో ఉండటాన్ని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించి, తప్పులను సరిదిద్దుకోవాలి. ఒకరిద్దరి మీద నెపం నెట్టి తప్పించుకుంటే భవిష్యత్తు కూడా అంధకారం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
