Let's talk: editor@tmv.in
ఒంటరిగానే వెళ్దాం..అధికారంలోకి వద్దాం

ఒంటరిగానే వెళ్దాం..అధికారంలోకి వద్దాం

Pinjari Chand
10 అక్టోబర్, 2025

ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దామని, బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని, కచ్చితంగా తానే ఐదోసారి ముఖ్యమంత్రి అవుతానని మాయావతి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గురువారం బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 19వ వర్థంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్మారక్ స్థల్‌కు లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాయావతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీపై, ఎస్పీ, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. గతంలో బీఎస్పీ అధికారంలో ఉండగా చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు డబ్బులు ఇస్తే వచ్చినవారు కాదని, తమ రక్తం, చెమటను చిందించి కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు చేసుకుని ఇక్కడికి వచ్చారన్నారు. ప్రజలకు ఎప్పుడు మేం అండగా ఉన్నామని గుర్తు చేశారు. ఇక్కడ స్మారక స్థల్ నిర్వహించి, పెద్ద పార్క్​ ఏర్పాటు చేశామని టికెట్ ద్వారా వచ్చిన డబ్బును దాని నిర్వహణకే ఖర్చుపెట్టాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.

ఎస్పీ ద్వంద వైఖరి

సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో ద్వందవైఖరి అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకుంటే మరోలా మాట్లాడుతుందని ఆరోపించారు. బీజేపీ కంటే ముందు అధికారంలో ఉన్న ఎస్పీ గతంలో కాన్షీరాం జయంతిని కానీ, వర్థంతిని కానీ చేయలేదని, ఆయన మరణించిన రోజున అధికారంలో ఉన్న ఎస్పీ సంతాపదినాన్ని కూడా ప్రకటించలేదని, ఇప్పుడు ఆయనకు నివాళులు అర్పించాలని, ర్యాలీలు తీయాలని, సమావేశాలు ఏర్పాటు చేయాలని మూడు రోజుల ముందు ప్రకటించిందన్నారు. అలాగే అలీగఢ్ డివిజన్‌లో కాన్షీరాం నగర్ జిల్లాను ఏర్పాటు చేస్తే అఖిలేశ్ ప్రభుత్వం పేరును కాస్గంజ్‌గా మార్చిందని గుర్తు చేశారు. అలాగే అనేక పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యకళాశాలల పేర్లు కూడా మార్చిందని తెలిపారు. మరి కాన్షీరాం పైన అంత విశ్వాసం ఉంటే ఇవన్నీ ఎందుకు చేశారన్నారు. అలాగే అణగారిన వర్గాలు, దళితులు, పీడితులు కూడా వారికి గుర్తుకురారని, కనీసం అణగారిన వర్గాల అభివృద్దికి కృషి చేసిన సామాజిక వేత్తలను గుర్తుకుచేసుకోరన్నారు. అధికారం లేకుంటే మాత్రం అందరూ గుర్తుకువస్తారన్నారు. ఇది సమాజ్ వాదీ అసలు స్వరూపం అని వివరించారు.

రాజ్యాధికారం సాధించాలి

కాన్షీరాం పంజాబ్‌లో పుట్టి డా.బి.ఆర్ అంబేద్కర్ మాదిరి అణగారిన సమాజం పట్ల, మైనార్టీలు, దళితులు తదితరులకు రాజ్యాంగ్యంలో చెప్పిన విధంగా మద్దతుగా నిలిచారన్నారు. అంబేద్కర్ భావించినట్లు ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై నిలబడేలా, ఆత్మగౌరవంతో బతికేలా కాన్షీరాం కృషి చేశారన్నారు. బహుజన వర్గాలు అభివృద్ది చెందాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమన్నారు. కాన్షీరాం అంబేద్కర్​ బాటలో నడిచారు. కానీ బహుజనులు కొద్దిమొత్తంలో మాత్రమే అధికారంలో భాగస్వాములుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయనకు ఢిల్లిలో కూడా అణగారిన ప్రజలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. కానీ వీలుకాలేదన్నారు. ఆయన కలలను మనం సాకారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మా పార్టీ అధికారంలో ఉండగా ప్రతి సమయంలో గురువులను, మహత్ములైన మహత్మా జ్యోతిభాఫూలే, నారాయణగురు, అంబేద్కర్, షావూజీ మహారాజ్, కాన్షీరాం, సంత్ గురురవిదాస్, గౌతమ బుద్ధుడు లాంటి వారిని స్మరించుకుందన్నారు. వారు చూపిన విధంగానే మా పాలన సాగిందన్నారు. వారి పేర్లను కొన్ని నగరాలకు, విద్యాలయాలకు పెడితే తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మార్చేశాయన్నారు. కానీ వారు ఇప్పుడు మళ్లీ వారిని గుర్తు చేస్తున్నారన్నారు. వారు అధికారంలో ఉండగా గూండాలు, గ్యాంగ్​ స్టర్‌లు ఎక్కువయ్యాయన్నారు.

బీజేపీ ప్రభుత్వం కూడా బీఎస్పీ నాయకులను ఈడీ, సీబీఐ కేసులతో వేధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఇలానే ఇబ్బందులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దళితులను మోసం చేసిందన్నారు. కాన్షీరాం మరణిస్తే కనీసం సంతాప దినాలు ప్రకటించలేదని వాపోయారు. ఇప్పుడు కొంతమంది అణగారిన వర్గాలను మోసం చేయడానికి దళిత వేషంలో వస్తున్నారని వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే పార్టీ సమన్వయ కర్త ఆకాశ్ ఆనంద్ ను ఆదరించాలన్నారు. 2027లో జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, మన సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు.