
‘ఐ గాట్ కర్మయోగి పోర్టల్ లో ఏపీ సరికొత్త రికార్డు
పరిపాలనలో సంస్కరణలు, ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ ఐగాట్ కర్మయోగి' డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త జాతీయ రికార్డును సృష్టించింది. ఈ పోర్టల్ ద్వారా కోటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు సాధించడమే కాకుండా 80 లక్షలకు పైగా కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ప్రభుత్వ అధికారుల పనితీరును మెరుగు పరచడం ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్రం 2022లో ఈ వేదికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్‌డిపిఎస్) ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న 4,290 రకాల విభిన్న కోర్సులను ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున వినియోగించుకుంటోంది.
నిరంతర అభ్యాసమే లక్ష్యం: సీఎం
ఈ ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం చేస్తూ శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు "ఐజీఓటీ కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. కోటి రిజిస్ట్రేషన్లు, 80 లక్షల కోర్సు పూర్తిలు కావడం అనేది మన ఉద్యోగుల నిరంతర అభ్యాసం, వృత్తిపరమైన నైపుణ్యం పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న సమర్థవంతమైన పరిపాలనను అందించడంలో ఈ 'కర్మయోగి' చొరవ కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఐజీఓటీ విభాగం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ఫలితాలను ప్రత్యేకంగా ప్రశంసించింది. 'జాతీయ సామర్థ్య నిర్మాణ వేదిక' కింద ఈ స్థాయి లక్ష్యాలను చేరుకున్న మొదటి రాష్ట్రంగా ఏపీని పేర్కొంటూ అభినందించింది. డిజిటల్ శిక్షణ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్తేజం తీసుకురావడంలో ఏపీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఐగాట్* *కర్మయోగి:* *ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిజిటల్ శిక్షణ
2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాలు, సామర్థ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడానికి రూపొందించిన ఒక డిజిటల్ కార్యక్రమం. ఈ ప్లాట్‌ఫామ్‌లో పాలన, మేనేజ్మెంట్, సాంకేతికత, ఆరోగ్యం, విద్య వంటి విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు ఆన్లైన్ కోర్సులు, టెస్టులు, అసైన్‌మెంట్ల ద్వారా నిరంతర అభ్యాసం కొనసాగించవచ్చు. కాగా ఈ శిక్షణ ద్వారా ఉద్యోగులు భవిష్యత్తుకు సిద్ధమైన సమర్థవంతమైన పాలన కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యాన్ని పెంచుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారు.
