
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో డారిల్ మిచెల్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మిచెల్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ర్యాకింగ్స్ లో పైకి ఎగబాకాడు. ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2–1తో గెలుచుకుని, భారత్ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మిచెల్ రెండు శతకాలు బాదడంతో పాటు, కేవలం 54 ఇన్నింగ్స్‌ల్లోనే తన తొమ్మిదో వన్డే శతకాన్ని నమోదు చేసి, ఈ ఘనత సాధించిన నాలుగో అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఇమామ్ ఉల్ హక్ (48), హషీం ఆమ్లా (52), క్వింటన్ డికాక్ (53) మాత్రమే అతని కంటే ముందున్నారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మిచెల్ మొత్తం 352 పరుగులు సాధించాడు. ఇది మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్‌గా రికార్డుకెక్కింది. అంతేకాదు అన్ని దేశాల పరంగా చూస్తే బాబర్ ఆజమ్ (360 – వెస్టిండీస్‌పై 2016లో), శుభ్‌మన్ గిల్ (360 – న్యూజిలాండ్‌పై 2023లో) తర్వాత మూడో అత్యధిక సిరీస్ స్కోర్‌గా నిలిచింది. ఐసీసీ ప్రకారం మిచెల్ 845 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, 795 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ ఇద్దరి తర్వాత అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రాహీం జద్రాన్, భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ ఉన్నారు.
మిచెల్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలవడం ఇది రెండోసారి. అయితే గతేడాది నవంబర్‌లో అతను ఈ స్థానం దక్కించుకున్నప్పుడు కేవలం మూడు రోజులకే రోహిత్ శర్మ అతన్ని అధిగమించాడు. భారత్‌లో భారత్‌పై అత్యధిక వన్డే శతకాలు సాధించిన ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ (5) తర్వాత డారిల్ మిచెల్ (4) నిలిచాడు. మరో విశేషం ఏమిటంటే, 54 వన్డే ఇన్నింగ్స్‌లలో ఇప్పటివరకు మిచెల్ ఒక్కసారి కూడా డక్ ఔట్ కాలేదు. ఇది చరిత్రలో రెండో అతి పెద్ద రికార్డు కాగా, 1983 నుంచి 1994 మధ్య 105 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా డక్ కాకుండా కేప్లర్ వెస్సెల్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇతర ఆటగాళ్లు
• ఇబ్రాహీం జద్రాన్ (764 పాయింట్లు) మూడో స్థానానికి చేరగా, రోహిత్ శర్మ (757) నాలుగో స్థానానికి దిగాడు.
• గ్లెన్ ఫిలిప్స్ భారత్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో మిచెల్‌తో కలిసి 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది న్యూజిలాండ్ వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద భాగస్వామ్యం.
• ఫిలిప్స్ 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు. అలాగే వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో 14 స్థానాలు మెరుగుపడి సంయుక్తంగా 31వ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో అఫ్గానిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్ జాయ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
• వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్ మైకేల్ బ్రేస్‌వెల్ ఆరు స్థానాలు ఎగబాకి 33వ స్థానానికి చేరాడు.
• బౌలర్ల జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ (710 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (670) రెండో స్థానంలో ఉన్నాడు.
• టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా రషీద్ ఖాన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరాడు.
