
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త! 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న ప్రారంభమై, జూలై 5 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 12 జట్లు ఈసారి టైటిల్ కోసం పోటీపడుతుండటం విశేషం. ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీ మొదలవుతుంది.
12 జట్ల మధ్య హోరాహోరీ పోరు
డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లాండ్, వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియాలతో పాటు క్వాలిఫయర్ల ద్వారా అర్హత సాధించిన బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఈ ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. నెదర్లాండ్స్ జట్టు ఈ టోర్నీలో అరంగేట్రం చేయడం గమనార్హం. జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి, సెమీస్ కోసం పోరాడనున్నాయి.
గ్రూప్-1:
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
గ్రూప్-2:
వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్
ముఖ్యమైన మ్యాచ్‌లు
టోర్నీ ప్రారంభ రోజైన జూన్ 12న ఇంగ్లాండ్-శ్రీలంక జట్లు తలపడతాయి. ఇక జూన్ 13న చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఉండగా, జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. జూన్ 20న ఇంగ్లాండ్-స్కాట్లాండ్ మ్యాచ్ జరగనుండగా, ఇది ఐసీసీ ఈవెంట్‌లో ఇంగ్లాండ్ గడ్డపై ఈ రెండు జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ కావడం విశేషం.
ఈ టోర్నీ గురించి ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ "మహిళా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. గతంలో భారత్‌లో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ సృష్టించిన రికార్డులను, అదే ఉత్సాహాన్ని ఈ టోర్నీలోనూ కొనసాగించాలనుకుంటున్నాం" అని తెలిపారు. జూన్ 30, జూలై 2 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనుండగా, లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 5న విశ్వవిజేత ఎవరో తేలనుంది.
