
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్-2లో మనోళ్లే!
అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడిన టీమిండియా తన ఆధిపత్యాన్ని ర్యాంకింగ్స్‌లోనూ చాటింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20ఐ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రపంచకప్‌లో వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించగా, ఆ విజయానికి కారకులైన ఆటగాళ్లకు ర్యాంకింగ్స్ రూపంలో తగిన ప్రతిఫలం లభించింది.
బ్యాటింగ్‌లో తొలి రెండు స్థానాల్లో మనోళ్లే
ప్రస్తుతం టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో భారత ఆటగాళ్లే ఉండటం విశేషం. కివీస్‌తో జరిగిన ఫైనల్లో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ఈ టోర్నీలో మొత్తం 317 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్, అభిషేక్ కంటే కేవలం 4 పాయింట్ల వెనుక మాత్రమే ఉండి గట్టి పోటీ ఇస్తున్నాడు. మరోవైపు, భారత ఆటగాళ్లు సంజు శాంసన్ 22వ స్థానానికి, శివమ్ దూబే 27వ స్థానానికి చేరుకుని తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. ఇక ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికి వస్తే.. సెమీఫైనల్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 20వ స్థానానికి చేరుకున్నాడు
బౌలింగ్‌లో విభాగంలో స్వల్ప నిరాశ
బౌలింగ్ విభాగంలో భారత్‌కు స్వల్ప నిరాశ ఎదురైంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తిరిగి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ ర్యాంక్‌కు, అక్షర్ పటేల్ 6 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
అల్ రౌండర్లలో హార్దిక్ జోరు
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత స్టార్ హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ తమ కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను సాధించడం గమనార్హం. కివీస్ కెప్టెన్ శాంట్నర్ 9వ స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ 13వ స్థానానికి ఎగబాకాడు.
