Let's talk: editor@tmv.in
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: ఇషాన్ కిషన్ @నెం.8

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: ఇషాన్ కిషన్ @నెం.8

Shaik Mohammad Shaffee
19 ఫిబ్రవరి, 2026

టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా చెలరేగిపోతుండటంతో ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా డ్యాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తూ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 77) అతడిని టాప్-10లో నిలబెట్టింది. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నలుగురు భారత ఆటగాళ్లు ఉండటం విశేషం.

బ్యాటింగ్‌లో భారతీయుల హవా

బ్యాటింగ్ విభాగంలో భారతీయుల హవా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో 197.50 స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతున్న ఇషాన్ కిషన్ 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకుని నెం.1గా కొనసాగుతుండగా, తిలక్ వర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో నిలకడగా కొనసాగుతుండగా, మరోవైపు ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సంక మూడో స్థానానికి ఎగబాకాడు.

బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి @నెం.1

మరోవైపు బౌలింగ్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నెం.1 ర్యాంకును పదిలం చేసుకున్నాడు. అయితే అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి చేరుకుని వరుణ్‌కు గట్టి పోటీనిస్తున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరగా, స్పిన్నర్ అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానంలో నిలిచాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ అనూహ్యంగా ఐదు స్థానాలు కోల్పోయి 16వ ర్యాంకుకు పడిపోగా, ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రాడ్ ఎవాస్ ఏకంగా టాప్-10లోకి దూసుకొచ్చాడు.

ఆల్‌రౌండర్లలో హార్దిక్, దూబే హవా

ఆల్‌రౌండర్ల జాబితాలో భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో ఆల్‌రౌండర్ శివం దూబే మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకుతో టాప్-10లోకి ప్రవేశించాడు. పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్, జింబాబ్వే వెటరన్ సికందర్ రజాలు కూడా ఈ విభాగంలో గట్టి పోటీనిస్తున్నారు.