Let's talk: editor@tmv.in
ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

Shaik Mohammad Shaffee
11 మార్చి, 2026

టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చిన్నపాటి షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా అర్ష్‌దీప్ క్రమశిక్షణా రికార్డులో ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. గత 24 నెలల కాలంలో అర్ష్‌దీప్ ఇలాంటి తప్పిదానికి పాల్పడటం ఇదే మొదటిసారి.

అసలేం జరిగింది?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ష్‌దీప్ వేసిన బంతిని బ్యాటర్ డారిల్ మిచెల్ డిఫెన్స్ ఆడగా.. ఫాలోత్రూలో బంతిని అందుకున్న అర్ష్‌దీప్, ఒక్కసారిగా ఆగ్రహంతో బ్యాటర్ వైపు విసిరాడు. ఆ బంతి నేరుగా మిచెల్ ప్యాడ్లకు తగిలింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో తోటి ఆటగాళ్లపైకి ప్రమాదకరంగా లేదా అనుచితంగా బంతిని విసరడం నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుంది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ జరిమానాను ఖరారు చేశారు.

తప్పు ఒప్పుకున్న అర్ష్‌దీప్

ఈ ఘటనపై ఐసీసీ విచారణకు ఆదేశించగా, అర్ష్‌దీప్ తన తప్పును అంగీకరించాడు. మ్యాచ్ రెఫరీ ప్రతిపాదించిన శిక్షను సమ్మతించడంతో ఎటువంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ ప్రక్రియ ముగిసింది. సాధారణంగా ఇలాంటి 'లెవల్-1' ఉల్లంఘనలకు కనీసం మందలింపు నుంచి గరిష్టంగా 50 శాతం మ్యాచ్ ఫీజు కోత, అలాగే ఒకటి లేదా రెండు డిమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది.

ఈ చిన్నపాటి వివాదం పక్కన పెడితే, ఫైనల్ పోరులో కివీస్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా అవతరించడంతో పాటు, సొంత గడ్డపై కప్పు గెలిచిన మొదటి జట్టుగా, టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న తొలి టీమ్‌గా అరుదైన రికార్డులను తన పేరిట రాసుకుంది.

ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా - Tholi Paluku