
ఐసీసీ కఠిన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ
రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శనివారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరినా, టోర్నీకి ఇంత తక్కువ సమయంలో అది సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడాన్ని బీసీబీ నిరాకరించింది. అయితే బంగ్లాదేశ్ జట్టుకు భారత్‌లో ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టంగా తెలిపింది. ఇప్పటికే విడుదలైన మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చేయడం సరికాదని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, అర్హత కోల్పోయిన జట్లలో అత్యధిక టీ20 ర్యాంకింగ్ ఉన్న స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది. స్కాట్లాండ్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ఇది నమీబియా, యూఏఈ, నేపాల్, యూఎస్‌ఏ, కెనడా, ఒమన్, ఇటలీ కంటే ముందుంది.
బీసీబీ ప్రతిపాదనకు ఘోర పరాభవం
గత బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలన్న ప్రతిపాదనకు 14-2 తేడాతో ఓటమి ఎదురైంది. పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచింది. ఐసీసీ ప్రకటనలో ప్రచురించిన షెడ్యూల్ ప్రకారం టోర్నీలో పాల్గొనడానికి బీసీబీ అంగీకరించకపోవడంతో, బంగ్లాదేశ్ ఇకపై టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనదు. భద్రతా అంశాలపై బీసీబీ లేవనెత్తిన ఆందోళనలను ఐసీసీ సుదీర్ఘంగా పరిశీలించిందని, అయినప్పటికీ భద్రతా ముప్పు ఏదీ లేదని తేలిందని తెలిపింది. బీసీబీకి 24 గంటల గడువు ఇచ్చినా, భారత్‌లో ఆడేందుకు స్పష్టమైన అంగీకారం రాకపోవడంతో, ఐసీసీ తన నియమావళి ప్రకారం ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొంది.
గ్రూప్–సీ లో స్కాట్లాండ్
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ గ్రూప్–సీ లోకి ప్రవేశించింది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి.
స్కాట్లాండ్ మ్యాచ్‌లు ఇలా ఉన్నాయి
ఫిబ్రవరి 7: వెస్టిండీస్‌తో (కోల్కతా)
ఫిబ్రవరి 9: ఇటలీతో (కోల్కతా)
ఫిబ్రవరి 14: ఇంగ్లండ్‌తో (కోల్కతా)
ఫిబ్రవరి 17: నేపాల్‌తో (ముంబై)
బీసీబీకి భారీ ఆర్థిక నష్టం
ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం తప్పేలా లేదు. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు లభించే 5 లక్షల డాలర్ల (యూఎస్డీ 500,000) ఫీజును బీసీబీ కోల్పోతుంది. అంతేకాదు ఐసీసీ నుంచి బీసీబీకి ఏటా వచ్చే సుమారు 27 మిలియన్ డాలర్లు (దాదాపు 330 కోట్ల బంగ్లాదేశ్ టాకా) ఆదాయంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది బీసీబీ వార్షిక బడ్జెట్‌లో సుమారు 60 శాతం. అదనంగా స్పాన్సర్‌షిప్ ఆదాయం, అలాగే భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా వచ్చే ఆదాయం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బీసీబీకి మిగిలిన ఏకైక న్యాయ మార్గం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్), లాసానేను ఆశ్రయించడం మాత్రమే. అయితే అలా చేసినా టోర్నీ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
