Let's talk: editor@tmv.in
ఐర్లాండ్‌లో చారిత్రాత్మక మార్పు – స్వతంత్ర అభ్యర్థి కాన్నెలీ అద్భుత విజయం

ఐర్లాండ్‌లో చారిత్రాత్మక మార్పు – స్వతంత్ర అభ్యర్థి కాన్నెలీ అద్భుత విజయం

Yekkirala Akshitha
27 అక్టోబర్, 2025

స్వతంత్ర ఎడమపక్ష రాజకీయ నాయకురాలు కాథరిన్ కాన్నెలీ ఐర్లాండ్ కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సెంట్రిస్ట్ ఫైన్ గేల్ పార్టీకీ చెందిన ప్రత్యర్థి హెడర్ హమ్ఫ్రిస్ ఓటమిని అంగీకరించడం ద్వారా ఆమె విజయం ఖరారయింది.

ముందస్తు లెక్కల ప్రకారం నిర్ణయాత్మక విజయం సాధించిన నేపథ్యంలో హమ్ఫ్రిస్, “ఐర్లాండ్ కొత్త అధ్యక్షురాలిగా అవతరించిన కాన్నెలీకి అభినందనలు” అందించారు. ఉప ప్రధానమంత్రి ఫైన్ గేల్ నాయకుడు సైమన్ హారిస్ కూడా “ఆమె దేశమంతటికీ అధ్యక్షురాలు అవుతారు, ఆమె విజయం ఐర్లాండ్ విజయంగా నిలుస్తుంది” అంటూ ‘ఎక్స్’లో సందేశం విడుదల చేశారు.

68 ఏళ్ల కాన్నెలీ ఐర్లాండ్‌లో జన్మించి పెరిగారు. ఆమె క్లినికల్ సైకాలజిస్టుగా శిక్షణ పొందిన తర్వాత న్యాయవాదిగా అర్హత సాధించారు. సామాజిక విజ్ఞానం చట్ట రంగాల్లో అనుభవంతో, ఆమె సమాజంలో ఉన్న సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, సామాజిక న్యాయం, సమానత్వ అంశాలపై ఆమె దృష్టి సారించారు. 2016లో స్వతంత్ర ఎంపీగా రాజకీయాల్లోకి ప్రవేశించి, సూత్రనిష్ఠమైన ప్రజాముఖ దృక్పథంతో గుర్తింపు పొందారు. సిన్ ఫేన్, లేబర్ వంటి ఎడమపక్ష పార్టీల మద్దతును అందుకున్నారు.

కాన్నెలీ స్వతంత్ర ఆలోచనలతో ప్రసిద్ధురాలు. ఆమె నాటోకు వ్యతిరేకం, సైనిక జోక్యాలను నిరసిస్తారు, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తారు, ఐక్య ఐర్లాండ్ కోసం వాదిస్తారు. అలాగే సామాజిక సమానత్వం, వాతావరణ చర్యలపై దృష్టి పెడతారు. ఈ దృక్పథం యువ ఓటర్లతో పాటు సామాజిక న్యాయం, మానవ హక్కులకు ప్రాధాన్యతనిచ్చే ఓటర్ల హృదయాలను గెలుచుకుంది.

విజయం అనంతరం డబ్లిన్ కోటలో ప్రసంగించిన కాన్నెలీ, “నేను అందరికీ అధ్యక్షురాలిని — ఎవరు ఎలా ఓటు వేశారన్నదానికదీయకుండా ప్రతి ఒక్కరిని ప్రాతినిధ్యం వహిస్తాను” అన్నారు. సమగ్రత, వైవిధ్యం, నిర్మాణాత్మక ప్రశ్నించే తత్వం ఆధారంగా పౌరులందరికీ విలువనిచ్చే ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయోత్సాహాన్ని పంచుకుంటూ, ప్రత్యర్థి హమ్ఫ్రిస్‌తో ముందుగా వాగ్దానం చేసినట్లుగా సంయుక్త గ్లాసు లేవదీయడం జరిగింది. ఆమె ప్రచారంలో నిష్పక్షపాత విధానం, వాతావరణ చర్యలు, సామాజిక సమానత్వం, మానవతా విలువలు ప్రధాన అంశాలుగా నిలిచాయి.

కాన్నెలీ ఎన్నిక అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. బ్రిటన్‌లో ఆమె నాటో విమర్శలు, బ్రిటన్‌పై నమ్మకం లేనని చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి. అమెరికాలో ఆమె ఇజ్రాయెల్‌పై విమర్శాత్మక దృక్పథం, అమెరికా సైనిక జోక్యాలపై వ్యతిరేకత గమనార్హమైంది. విశ్లేషకుల ప్రకారం, ఈ దృక్పథం ఐర్లాండ్ విదేశీ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. యూరోపియన్ యూనియన్‌లో కాన్నెలీ నీయోలిబరల్, సైనిక విధానాలపై విమర్శలు చేయడం ఐర్లాండ్-ఇయూ రక్షణ సమన్వయానికి సవాలుగా భావిస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్‌లోని జాతీయవాద నేతలు ఆమె ఎన్నికను ఐక్య ఐర్లాండ్ దిశగా సానుకూల సంకేతంగా చూస్తున్నారు.

ఎన్నిక ప్రక్రియ పరిమిత పోటీ కారణంగా విమర్శలకు గురైంది. రికార్డు స్థాయిలో నిర్లక్ష్య ఓట్లు, తక్కువ ఓటరు హాజరతనం నమోదయ్యాయి. “ది ఐరిష్ టైమ్స్” ప్రకారం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 40%కంటే తక్కువ ప్రజలు ఓటు వేశారు. ఫియానా ఫాయిల్ అభ్యర్ధి వైదొలిగిన తరువాత, కాన్నెలీ హమ్ఫ్రిస్ మాత్రమే పోటీలో ఉండగా ఈ ఎన్నిక ప్రధానంగా ఆచారప్రాయమైనదిగా మారింది. అంతేకాక, వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్ వలస విధానాలపై ఉద్రిక్త చర్చలు కూడా జరుగుతున్నాయి.

రెండు సార్లు ఏడు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన అధ్యక్షుడు మైఖేల్ డి. హిగిన్స్ స్థానంలో కాన్నెలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 63% ఓట్లతో సాధించిన ఆమె విజయం, మానవతా విలువలు, స్వాతంత్ర్యం, సమానత్వం మీద ఆధారపడిన ప్రజాస్వామ్య నాయకత్వంపై ప్రజల ఆశల ప్రతిబింబంగా నిలుస్తోంది. ఆమె స్పష్టమైన అభిప్రాయాలు భవిష్యత్‌లో ఐర్లాండ్ విదేశాంగ దిశను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు.