Let's talk: editor@tmv.in
ఐరాస కాప్30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు

ఐరాస కాప్30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న కీలకమైన కాప్30 వాతావరణ శిఖరాగ్ర సదస్సు ప్రధాన వేదికలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 21 మందికి గాయాలవ్వగా, వేలాది మంది ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం ‘బ్లూ జోన్’ అని పిలిచే ప్రధాన వేదికలో సంభవించింది. ఈ బ్లూ జోన్‌లోనే ముఖ్యమైన చర్చలు, సమావేశాలు, దేశాల స్టాల్స్ (పావిలియన్లు), మీడియా సెంటర్, ప్రముఖుల కార్యాలయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకొని దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో వేలాది మంది ప్రతినిధులు భయంతో బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రమాదంలో గాయపడిన 21 మందిలో, 19 మంది పొగ పీల్చడం వల్ల, ఇద్దరు ఆందోళన కారణంగా అనారోగ్యానికి గురయ్యారని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఎవరికీ మంటల వల్ల కాలిన గాయాలు కాలేదని తెలిపారు. వెంటనే వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించగా, 12 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ ఘటన జరిగిన సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ కూడా వేదిక వద్దే ఉన్నారు, కానీ ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అలాగే భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా భారత ప్రతినిధి బృందంతో కలిసి బ్లూ జోన్‌లో ఉండగా, వారు కూడా సురక్షితంగా బయటపడ్డారని భారత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

అగ్నిప్రమాదం తర్వాత, భద్రతా కారణాల వల్ల అధికారులు దాదాపు ఆరు గంటల పాటు వేదికను మూసివేశారు. సమగ్ర తనిఖీ తర్వాత రాత్రి 8:40 గంటలకు ‘బ్లూ జోన్’ను తిరిగి తెరిచారు. అయితే మంటలు అంటుకున్న పావిలియన్ ప్రాంతాన్ని మాత్రం సదస్సు ముగిసే వరకు మూసి ఉంచుతామని ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ ఎఫ్ సీసీసీ ప్రకటించింది. ఈ ప్రమాదం కారణంగా ఆ రోజు జరగాల్సిన ముఖ్య చర్చలు రద్దు అయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో, మిగిలిన చర్చలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రతినిధులు కృషి చేశారు. బెలెం నగరంలో నవంబర్ 10 నుంచి 21 వరకు ఈ కాప్30 సదస్సును నిర్వహించారు. సుమారు 190 దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు.

ఐరాస కాప్30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు - Tholi Paluku