
ఐరాస సంస్కరణలకు భారత్ మద్దతు
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్య రాజ్య సమితి సాధారణ సమావేశాల సందర్భంగా జపాన్, జర్మనీ, బ్రెజిల్ మంత్రులతో జీ4 సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐక్య రాజ్య సమితి సంస్కరణలు, ముఖ్యంగా భద్రతా మండలి విస్తరణపై చర్చించారు. ఐరాస భద్రతా మండలి సంస్కరణల కోసం దేశాల మధ్య జరిగే చర్చల ప్రక్రియ (ఐజీఎన్) పురోగతిని సమీక్షించారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. జపాన్ మంత్రి తకేషి ఇవాయా, జర్మనీ మంత్రి జోహన్ వాడెఫుల్, బ్రెజిల్ మంత్రి మౌరో వియెరాతో సమావేశమైనట్లు తెలిపారు. జీ4 సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి సంస్కరణలకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని పేర్కొన్నారు.
కీలక ద్వైపాక్షిక సమావేశాలు
న్యూయార్క్ పర్యటనలో జైశంకర్ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. మలేషియా విదేశాంగ మంత్రి మొహమద్ హాజీ హసన్‌ను కలిశారు. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి యవెట్టె కూపర్‌తో సమావేశమై, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి బ్రిటన్ పర్యటన, విజన్ 2035 ప్రకటనపై చర్చించారు. ఈజిప్టు మంత్రి బదర్ అబ్దెలట్టీతో మాట్లాడారు. ఆస్ట్రేలియా మంత్రి సెనేటర్ వాంగ్‌ను కలిశారు. దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయ, ఆర్థిక అస్థిరతల నడుమ జీ20 దేశాలు స్థిరత్వం కాపాడేందుకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దౌత్యం, ఉగ్రవాద నిరోధం, శక్తి, ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చని సూచించారు.
దేశ ప్రయోజనాలు కాపాడుకుంటున్న భారత్
ఐక్య రాజ్య సమితి సాధారణ సభలను భారత్ సంపూర్ణంగా వినియోగించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటోంది. అదే సమయంలో పలు దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తూ కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల కోసం జీ4 దేశాలతో కలిసి ప్రయత్నిస్తోంది. జీ4లో భారతదేశం, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. భద్రతా మండలిలో సభ్యత్వానికి ఐరాసలో మూడింట రెండు వంతుల సభ్య దేశాలు ఓటింగ్ ద్వారా అంగీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు శాశ్వత సభ్య దేశాల అనుమతి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐరాసలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. చైనా వంటి దేశాలు జీ4 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సంస్కరణల లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ, భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ బలమైన ఆకాంక్షను స్పష్టం చేస్తుంది. చైనా తీరు సంస్కరణలను క్లిష్టతరం చేస్తోంది. జీ4 దేశాలు తమ ఐక్యతను కొనసాగిస్తూ, ఈ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతున్నాయి. మరోవైపు జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు ఆయా దేశాలతో ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారం పెంచేందుకు దోహదపడతాయి.
చైనా వ్యతిరేకించడానికి కారణాలు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జీ4 దేశాలు, ముఖ్యంగా భారత్ సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడానికి పలు రాజకీయ, భౌగోళిక కారణాలున్నాయి. చైనా ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. భారతదేశం శాశ్వత సభ్యత్వం పొందితే అంతర్జాతీయ వేదికలపై చైనాతో సమాన స్థాయిలో ప్రభావాన్ని చూపగలదు. ఇది చైనా ప్రాంతీయ, గ్లోబల్ ఆధిపత్యానికి సవాలుగా మారుతుంది. దీంతో పాటు భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఇటీవల ఉద్రిక్తతలను పెంచాయి. భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందితే చైనాపై సరిహద్దు అంశాల్లో ఒత్తిగి పెరిగే అవకాశముంది. చైనాతో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధాలు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
భారత్‌కు సభ్యత్వం దక్కితే వీటో అధికారాలతో నిర్ణయాలను అడ్డుకుంటుందన్న అభద్రతాభావం కూడా చైనాకు ఉంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం నాటి చారిత్రక విభేదాలతో జపాన్ చేరికను కూడా చైనా వ్యతిరేకిస్తోంది. ఆసియా నుంచి ఏకైక సభ్య దేశంగా ఉన్న చైనా తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఇతర దేశాల చేరికను వ్యతిరేకిస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం శోచనీయం. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు సహకారం, గ్లోబల్ సౌత్ నాయకత్వంతో శాశ్వత సభ్యత్వానికి అర్హత కోసం భారత్ డిమాండ్ చేస్తోంది.
