
ఐరాసలో గాజా కాల్పుల విరమణ తీర్మానం
గాజాలో కాల్పుల విరమణ డిమాండ్ చేస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఆరోసారి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్ గాజా సిటీపై తన దాడులను విస్తరిస్తున్న సమయంలో ఈ తీర్మానం తిరస్కరణకు గురైంది. భద్రతా మండలి 15 సభ్యుల్లో 14 మంది ఈ తీర్మానాన్ని ఆమోదించారు. వీటో అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. దీనికి తెలుగులో నేను నిషేధిస్తాను అనే అర్థం వస్తుంది. యూఎన్ భద్రతా మండలిలో వీటో అనేది ఒక శాశ్వత సభ్య దేశం తీర్మానాన్ని అడ్డుకునే హక్కు. శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ లకు వీటో శక్తి ఉంది. వీటిలో ఏ ఒక్క దేశం తీర్మానాన్ని వ్యతిరేకించినా అది ఆమోదం పొందదు. ఎన్ని దేశాలు మద్దతిచ్చినా ఆ తీర్మానం తిరస్కరణకు గురవుతుంది. గాజాలో తక్షణ, షరతులు లేని, శాశ్వత కాల్పుల విరమణ కోరుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. అన్ని పక్షాలు దీనిని పాటించాలని, హమాస్ ఇతర సమూహాలు పట్టుకున్న బందీలను విడుదల చేయాలని, గాజాకు మానవతా సాయం ఆంక్షలు తొలగించాలని మండలి కోరింది. అమెరికా గాజా పట్ల చూపిస్తున్న పక్షపాత ధోరణి గాజా మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది.
పదిమంది సభ్యులతో రూపకల్పన
గాజా యుద్ధం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. మండలిలో ఎంపిక చేసిన పది మంది సభ్యులు ఈ తీర్మానాన్ని రూపొందించారు. గాజా విపత్తుతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో కనీసం 65,141 మంది మరణించారు. అమెరికా ఈ ప్రయత్నాన్ని వీటో చేసింది. ఈ తీర్మానానికి అమెరికా వ్యతిరేకత ఆశ్చర్యం కలిగించదని అమెరికా మిడిల్ ఈస్ట్ డిప్యూటీ స్పెషల్ ఎన్వాయ్ మోర్గాన్ ఓర్టాగస్ చెప్పారు.ఈ తీర్మానం హమాస్‌ను ఖండించలేదని, ఇజ్రాయెల్ స్వరక్షణ హక్కును గుర్తించలేదని, హమాస్‌కు లాభం చేకూర్చే తప్పుడు కథనాలను చట్టబద్ధం చేస్తుందని ఆమె అన్నారు. ఓర్టాగస్ గాజాలో కరువు గురించి యూఎన్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ప్రకటన తప్పుడు పద్ధతి ఉపయోగించిందని చెప్పారు.
భద్రతా మండలిపై తగ్గుతున్న విశ్వాసం
ఓటు తర్వాత పాలస్తీనా యూఎన్ రాయబారి రియాద్ మన్సూర్ అమెరికా వీటోపై స్పందిస్తూ ఇది చాలా బాధాకరమన్నారు. ఈ భయంకర సంఘటనల ముందు భద్రతా మండలి తన బాధ్యత నిర్వర్తించకుండా ఆగిపోయిందని, ప్రజలను జెనోసైడ్( ఒక జాతిని నిర్మూలించడానికి ఉద్దేశపూర్వకంగా చేయబడే చర్యలు) నుంచి కాపాడలేకపోయిందని రియాద్ మన్సూర్ అన్నారు. దురదృష్టవశాత్తు మండలి మౌనంగా ఉండాల్సి వస్తోందని, దాని విశ్వసనీయత, అధికారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అల్జీరియా ఐ.రా.స రాయబారి అమర్ బెండ్‌జమా దీనిపై మాట్లాడారు. "పాలస్తీనా సోదరులు, సోదరీమణులు, మమ్మల్ని క్షమించండి" అని అన్నారు. "ప్రపంచం హక్కుల గురించి మాటలు చెబుతుంది కానీ పాలస్తీనా ప్రజలకు ఆ హక్కులు ఇవ్వడం లేదు. మా నిజాయితీ ప్రయత్నాలు ఈ తిరస్కారం ముందు నీరుగారిపోయాయి" అని చెప్పారు. గాజా యుద్ధంలో 18,000 పిల్లలు, 12,000 మహిళలు, 1,400 డాక్టర్లు, నర్సులు, 250 జర్నలిస్టులు చనిపోయారని బెండ్‌జమా తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థ ఒకవైపు మొగ్గు చూపడం వల్ల ఇజ్రాయెల్ రక్షింపబడుతోందన్నారు. ఇజ్రాయెల్ ఐ.రా.స రాయబారి డానీ డానన్ మాట్లాడుతూ గాజా యుద్ధానికి, ఇజ్రాయెల్‌కు ఎటువంటి సమర్థింపులు అవసరం లేదని, అమెరికా వీటో చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఓటు ఐ.రా.స 80వ వార్షికోత్సవం సందర్భంలో జరగడం బాధాకరమైన అంశంగా భావిస్తున్నారు. ఈ అంశంలో చాలా దేశాలు కలిసి దౌత్యం చేయాలని కోరుకుంటున్నాయి, కానీ అమెరికా ధోరణిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐ.రా.సకు అమెరికా సరైన మద్దతు ఇవ్వడం లేదు, మానవతా సాయం కోసం నిధులను కూడా తగ్గించింది. దీనివల్ల ఐ.రా.స 80 ఏళ్ల చరిత్రలో అత్యంత తక్కువ స్థాయికి చేరిందన్నారు.
హమాస్ నాశనమే ఇజ్రాయెల్ లక్ష్యం
గాజా నగరంపై మంగళవారం జరిపిన దాడితో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఆశలను చంపేస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలని ప్రకటించింది. సైన్యం చేయబోయే దాడుల గురించి ఎలాంటి స్పష్టత లేదు. కానీ హమాస్ ను నాశనం చేసేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చని చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం ఐ.రా.స మానవ హక్కుల మండలి నియమించిన స్వతంత్ర నిపుణుల బృందం ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్ చేస్తోందని, పాలస్తీనీయులను "నాశనం" చేయాలనే ఉద్దేశ్యంతో ఉందని నిర్ధారించింది. ఓటు ముందు ఇజ్రాయెల్ డానన్ ఎక్స్ వేదికగా "బందీలను విడుదల చేయదు, భద్రత తీసుకురాదు" అని పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ "హమాస్‌తో పోరాడుతుంది, తన పౌరులను రక్షిస్తుంది, భద్రతా మండలి ఉగ్రవాదాన్ని చూడకుండా ఉండాలనుకున్నా" అని చెప్పారు. డానిష్ ఐ.రా.స రాయబారి క్రిస్టినా మార్కస్ లాసెన్ ఇజ్రాయెల్ సృష్టించిన కరువు తీవ్రతను గుర్తు చేశారు. స్థానికంగా తల్లులు పిల్లలకు ఆకులు ఉడకబెట్టి తినిపిస్తున్నారని, తండ్రులు శిథిలాల్లో ఆహారం వెతుకుతున్నారని చెప్పారు. యుద్ధం, ఆకలి, నిరాశతో ఒక తరం జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా ఐ.రా.స భద్రతా మండలిలో గాజా కాల్పుల విరమణ తీర్మానాలపై ఆరు సార్లు వీటో వినియోగించింది. ఈ యుద్ధం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవలి వీటోలు 2023 అక్టోబర్ 18న బ్రెజిల్ డ్రాఫ్ట్‌పై, డిసెంబర్ 8న యూఏఈ డ్రాఫ్ట్‌పై, 2024 ఫిబ్రవరి 20న అల్జీరియా డ్రాఫ్ట్‌పై జరిగాయి. మరికొన్ని వీటోలు 2024, 2025లో సంభవించాయి, ఇప్పుడు సెప్టెంబర్ 18, 2025న ఆరోసారి వీటో వచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తూ ఈ వీటోలు చేస్తోంది. హమాస్‌ను ఖండించకుండా, ఇజ్రాయెల్ స్వరక్షణ హక్కును గుర్తించకుండా తీర్మానాలు ఉంటే వ్యతిరేకిస్తోంది. ఈ వీటోలు యూఎన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి, పాలస్తీనా ప్రజల ఆవేదనను తీవ్రం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటం వల్ల మానవతా సంక్షోభం తీవ్రమవుతోంది. భవిష్యత్తులో మరిన్ని తీర్మానాలు వచ్చినా అమెరికా వైఖరి మారకపోతే శాంతి నెలకొల్పడం కష్టం. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు చర్చలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
