Let's talk: editor@tmv.in
ఐబొమ్మ vs పోలీసులు

ఐబొమ్మ vs పోలీసులు

FL - SUNL
2 అక్టోబర్, 2025

డిజిటల్ యుగంలో సినిమా పైరసీ ఒక పెను సవాలుగా మారింది. ఈ సవాలుకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌తో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల మధ్య జరుగుతున్న డిజిటల్ యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకవైపు పోలీసులు ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకునేందుకు వల విసురుతుంటే, మరోవైపు ఐబొమ్మ నిర్వాహకులు సినిమా ఇండస్ట్రీపై విమర్శలతో పాటు పోలీసులకు సవాల్ విసురుతూ సంచలన ప్రకటన చేశారు.

పోలీసుల హెచ్చరిక, ఐబొమ్మ సమాధానం

మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం ఐబొమ్మకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. “ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే అరెస్ట్ చేసి చూపిస్తాం,” అని హెచ్చరించారు. దీనికి ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో సమాధానమిచ్చారు. “మీరు మా వెబ్‌సైట్‌పై ఫోకస్ చేస్తే, మేము కూడా మీపై ఫోకస్ చేస్తాం. మీ యాక్షన్‌కు మా రియాక్షన్ ఉంటుంది,” అని వారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఐబొమ్మ నిర్వాహకులు తమ పోస్ట్‌లో సినిమా ఇండస్ట్రీపై పలు కీలక విమర్శలు చేశారు. “హీరోలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అవసరమా? సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం హీరో-హీరోయిన్ల రెమ్యూనరేషన్, విదేశీ షూటింగ్‌లు, ట్రిప్‌ల కోసం ఖర్చు చేస్తున్నారు. లైట్ బాయ్స్ నుంచి ప్రొడక్షన్ సిబ్బంది వరకు వారికి ఎంత ఇస్తున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది, స్థానికులకు ఉపాధి కలుగుతుంది కదా?” అని వారు ప్రశ్నించారు.

అంతేకాదు, “అనవసర బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఆ రికవరీ కోసం డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు టికెట్ ధరలు పెంచుతున్నారు. చివరకు బాధపడేది మధ్యతరగతి ప్రేక్షకుడు,” అని వారు వాదించారు. “మీరు మా వెబ్‌సైట్‌పై ఫోకస్ చేయడం ఆపండి, లేకపోతే మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది,” అని హెచ్చరిస్తూ, “మేము ఎక్కడ ఉన్నా, భారతదేశం, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీసుల దాడి.. ఐబొమ్మపై ఒత్తిడి

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్‌పై గట్టి ఒత్తిడి తెచ్చారు. “ఐబొమ్మ నిర్వాహకుడు విదేశాల్లో ఉండొచ్చు, కానీ అతడిని త్వరలోనే పట్టుకుంటాం,” అని పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే ఐబొమ్మతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల రూ.2 కోట్ల ఖర్చుతో అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బృందం అనేక కీలక సమాచారాలను సేకరించింది.

ఐబొమ్మ వాదనలేంటి?

ఐబొమ్మ నిర్వాహకులు తమ పోస్ట్‌లో సినిమా ఇండస్ట్రీలోని ఆర్థిక అసమానతలను ప్రశ్నించారు. వారి వాదనలు కొంతమందికి సమర్థనీయంగా అనిపించినా, పైరసీ చట్టవిరుద్ధమనే వాస్తవాన్ని మార్చలేవు. అయితే, వారు చెప్పిన కొన్ని అంశాలు సినిమా ఇండస్ట్రీలో చర్చకు తావిచ్చాయి. ఉదాహరణకు, హీరోల రెమ్యూనరేషన్, విదేశీ షూటింగ్‌ల వల్ల పెరిగే బడ్జెట్, టికెట్ ధరల పెరుగుదల వంటి అంశాలు సామాన్య ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.

ఐబొమ్మ భవిష్యత్తు ఏంటి?

ఐబొమ్మ నిర్వాహకులు తమ పోస్ట్‌లో ఒక విషయాన్ని స్పష్టం చేశారు: “మేము కొన్ని సినిమాలను స్వయంగా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు వెంటనే తొలగిస్తే, మేము భయపడినట్లు లేదా మీరు తొలగించినట్లు అనిపిస్తుంది. అందుకే కొన్ని గంటల తర్వాత తొలగిస్తాం.” ఈ ప్రకటన వారి ధైర్యాన్ని చాటినప్పటికీ, పోలీసులు వారిని పట్టుకునేందుకు దృఢసంకల్పంతో ఉన్నారు.

ఐబొమ్మ నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌ను ఇండియాలో తొలగించిన తర్వాత టెక్నాలజీ షేర్ చేయాలని కోరారని, దానికి కొందరు ఒప్పుకున్నారని కూడా పేర్కొన్నారు. అయితే, “మేము ibomma.net వాళ్లంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి,” అని చెప్పడం ద్వారా వారు తమ గట్టి వైఖరిని స్పష్టం చేశారు.

ఐబొమ్మ vs పోలీసులు - Tholi Paluku