Let's talk: editor@tmv.in
ఐబీపీఎస్‌ క్లర్క్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

ఐబీపీఎస్‌ క్లర్క్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

Shaik Mohammad Shaffee
26 సెప్టెంబర్, 2025

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 10,277 క్లర్క్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఐబీపీఎస్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే తమ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్‌ 4, 5, 11 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. నవంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా

అభ్యర్థులు ముందుగా ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.ibps.inను సందర్శించండి. హోమ్‌పేజీలో కనిపించే "ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్‌ లెటర్ ఫర్ సీఆర్‌పీ-సీఎస్‌‌ఏ- ఎక్స్‌వీ" అనే లింక్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ "లాగిన్ క్రెడెన్షియల్" విభాగంలో రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నిర్దేశిత ఖాళీలో నింపి, 'లాగిన్' బటన్‌పై క్లిక్ చేయండి. మీ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని సరిచూసుకుని, ప్రింట్‌ తీసుకోండి.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు

ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తమ అడ్మిట్‌ కార్డుతో పాటు, దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉపయోగించిన ఫోటో ఐడీ ప్రూఫ్ (పాన్ కార్డు/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/పాస్‌పోర్ట్ మొదలైనవి) ఒరిజినల్, దాని జిరాక్స్ కాపీని తప్పకుండా తీసుకెళ్లాలి. అడ్మిట్‌ కార్డుపై అంటించడానికి, దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన అదే పాస్‌పోర్ట్ సైజు ఫోటోను ఒకటి లేదా రెండు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.

బ్యాంకు క్లర్క్ కెరీర్ ఎలా ఉంటుంది?

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంకు క్లర్క్‌ను 'కస్టమర్ సర్వీస్ అసోసియేట్'గా పిలుస్తారు. క్లర్క్ ప్రధాన పాత్ర బ్యాంకు కౌంటర్లలో కస్టమర్లతో వ్యవహరించడం, డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కులు, డీడీలు వంటి రోజువారీ లావాదేవీలను నిర్వహించడం. క్లర్క్‌గా చేరినవారు బ్యాంకు అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణులై, స్కేల్-1 ఆఫీసర్ (పీఓ) స్థాయికి, ఆపై మేనేజర్ స్థాయికి కూడా పదోన్నతి పొందవచ్చు. క్లర్క్ జీతం ప్రారంభంలో సాధారణంగా నెలకు రూ.30,000 నుండి రూ.45,000 వరకు ఉంటుంది. వీరికి ఆరోగ్య బీమా, ప్రయాణ అలవెన్స్, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు వంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయి.

ఐబీపీఎస్‌ క్లర్క్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల - Tholi Paluku