Let's talk: editor@tmv.in
ఐఫోన్ కోసం పడిగాపులు

ఐఫోన్ కోసం పడిగాపులు

FL - BRTH
21 సెప్టెంబర్, 2025

భార‌త్‌లో ఐఫోన్ 17 మొబైల్ అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. దేశంలోని అన్ని ఆపిల్ స్టోర్లు ఉద‌యం 8 గంట‌ల‌కే త‌మ స్టోర్ల‌ను తెరిచాయి. ఐఫోన్ 17 అమ్మ‌కాలు మొద‌లుకాక ముందే కొనుగోలుదారులు క్యూక‌ట్టారు. దేశంలో ఆపిల్ స్టోర్లు నాలుగు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, పూణేలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. ముంబైలోని బీకేసీ ఆపిల్ స్టోర్ వ‌ద్ద భారీగా జ‌నం గుమిగూడారు. తోసుకుంటూ, ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకూంటు ఉన్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. పోలీసులు జోక్యం చేసుకుని ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన‌ట్టుగా వీడియోలో క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా క్యూలో నిల‌బ‌డి ఉన్న కొనుగోలుదారులు.. అంద‌రికంటే ముందుగా ఐఫోన్ 17 కొనుగోలు చేయాల‌నే ఆత్రుత‌తో వ్య‌వ‌హ‌రించిన విధానం గొడ‌వ‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. పోలీసులు కూడా స‌రిగా భ‌ద్ర‌తా చ‌ర్యలు తీసుకోలేద‌ని వీడియోల్లో కొంత‌మంది కొనుగోలుదారులు ఆరోపించారు.

ఆపిల్ స్టోర్లు ఉన్న బెంగ‌ళూరు, పూణే, న్యూఢిల్లీలో కూడా ఇదే స్థాయిలో క్యూ క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. చాలా మంది రాత్రి నుంచే ఆపిల్ స్టోర్ బ‌య‌ట వేచి ఉండ‌టం విశేషం. ఉద‌యం 8 గంట‌ల‌కు తెరిచే ఆపిల్ స్టోర్ల ముందు రాత్రి ఒంటి గంట నుంచే పడిగాపులు కాస్తున్నామని ప‌లువురు పేర్కొన్నారు. చాలా మంది వేచి ఉండ‌లేక ఇబ్బందిప‌డిన‌ట్టు చెబుతున్నారు. బెంగ‌ళూరు, పూణే, న్యూఢిల్లీ స్టోర్ల‌లో కొనుగోలుదారుల కోసం సీట్లు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ .. జ‌నం భారీగా రావ‌డంతో క్యూ లైన్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇండియాలో ఐఫోన్ 17 ధ‌ర రూ. 82,900 నుంచి మొద‌ల‌వుతుంది. అల్ట్రా స్లిమ్ ఐఫోన్ ఎయిర్ ధ‌ర రూ. 1,19,900. ఐఫోన్ ప్రొ ధ‌ర రూ. 1,34,900. ఐఫోన్ ప్రో మాక్స్ ధ‌ర రూ. 1,49,900. మొద‌టి రోజు అమ్మ‌కాల జోరును చూస్తే ఐఫోన్ 17 సిరీస్ ఆపిల్ కంపెనీకి మంచి విజ‌యాన్ని అందించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఐఫోన్ కోసం పడిగాపులు - Tholi Paluku