Let's talk: editor@tmv.in
ఐపీఓ బాటలో ఎలాన్ మస్క్ ‘స్పేస్‌ఎక్స్’!

ఐపీఓ బాటలో ఎలాన్ మస్క్ ‘స్పేస్‌ఎక్స్’!

Shaik Mohammad Shaffee
3 ఏప్రిల్, 2026

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక పత్రాలను కంపెనీ ఇప్పటికే దాఖలు చేసినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైతే, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల అధిపతి)గా అవతరించే అవకాశం ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వద్ద గోప్యంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది.

భారీ లక్ష్యాలు.. భారీ నిధులు

ఈ ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ సుమారు 75 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 6.90 లక్షల కోట్ల పైమాటే) నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన స్పేస్‌ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.140 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ విలువతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. సేకరించిన నిధులను చంద్రునిపై బేస్ ఏర్పాటు చేయడం, అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లను నిర్మించడం, భవిష్యత్తులో అంగారక గ్రహం మీదకు మనిషిని పంపే ప్రయోగాల కోసం మస్క్ వెచ్చించనున్నారు.

విస్తరిస్తున్న సామ్రాజ్యం

పునర్వినియోగ రాకెట్లను తయారు చేయడమే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ అయిన 'స్టార్‌లింక్' కూడా స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలోనే ఉంది. వీటికి తోడు, ఇటీవల మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్), ఆయన కృత్రిమ మేధ సంస్థ 'ఎక్స్ఏఐ' కూడా స్పేస్‌ఎక్స్‌లో విలీనమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కంపెనీ విలువను అమాంతం పెంచేశాయి. ఈ మెగా ఐపీఓ కోసం ఇప్పటికే పలు దిగ్గజ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకులు పోటీ పడుతున్నాయి.