Let's talk: editor@tmv.in
ఐపీఎల్ 2026 మెగా వేలం ఎప్పుడంటే?

ఐపీఎల్ 2026 మెగా వేలం ఎప్పుడంటే?

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నిర్వహించే ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. క్రిక్ బజ్ కథనం ప్రకారం, ఈ వేలం డిసెంబర్ 13, 14, 15వ తేదీల్లో జరగనుంది. అయితే దీనిపై ఐపీఎల్ పాలకమండలి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్రాంచైజీ యజమానులతో చర్చించిన తర్వాత తుది తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

క్రిక్ బజ్ కథనం ప్రకారం, ఈసారి వేలం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2023లో దుబాయ్‌లో, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరిగింది. అయితే ఈసారి భారత్‌లో ముఖ్యంగా ముంబైలో ఆటగాళ్ల వేలం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రిటెన్షన్ గడువు, ట్రేడింగ్ రూల్

ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను పదును పెట్టనున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15వ తేదీ లోపు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను, విడుదల చేస్తున్న క్రికెటర్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. వేలానికి ముందు ట్రేడింగ్ విండో తెరుస్తారు. దీని ప్రకారం ఫ్రాంచైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను మరొక జట్టుకు డబ్బు లేదా మరొక ఆటగాడికి బదులుగా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

సీఎస్‌కే, రాజస్థాన్ జట్లలో మార్పులు

గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో ఈసారి ఎక్కువ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన జట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

సీఎస్‌కే జట్టు దాదాపు సగం మంది ప్లేయర్లను వదిలివేయాలని భావిస్తోంది. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా విజయ్ శంకర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, సామ్ కరణ్, విదేశీ ఆటగాడు డేవాన్ కాన్వే వంటి వారు ఉన్నారట. వీళ్లను వదిలేసి, యువ క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. సీఎస్‌కే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు పర్స్ వాల్యూలో రూ.9.75 కోట్లు జమ అవుతాయి. ఈ డబ్బుతో మరో సమర్థవంతమైన ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయాలని సీఎస్‌కే ప్లాన్ చేస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి కెప్టెన్ సంజూ శాంసన్ తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈయనను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా సీఎస్‌కేలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్పిన్నర్లు వానిందు హసరంగా, మహీష్ తీక్షణ కూడా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా రషీద్ ఖాన్‌ను వదులుకోవాలని చూస్తోంది.

వేలంలో కీలకం కానున్న ఆటగాళ్లు

ఆస్ట్రేలియాకు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరాన్ గ్రీన్‌కు ఈ వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్‌లో గాయం కారణంగా మిస్ అయిన గ్రీన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడవచ్చు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ వేలంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడో చూడాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే!