Let's talk: editor@tmv.in
ఐపీఎల్ 2026: బెంగళూరులో 5 మ్యాచ్‌లు ఆడనున్న ఆర్‌సీబీ

ఐపీఎల్ 2026: బెంగళూరులో 5 మ్యాచ్‌లు ఆడనున్న ఆర్‌సీబీ

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఎట్టకేలక తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను ఎక్కడ ఆడుతుందనే సందిగ్ధతకు తెరపడింది. తమ సొంత గడ్డ అయిన బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఫ్రాంచైజీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన తరుణంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత, ఈ స్టేడియంలో మళ్లీ మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

భద్రతకు పెద్దపీట

గత ఏడాది ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, మహారాజా ట్రోఫీ వంటి ఎటువంటి ప్రధాన మ్యాచ్‌లు నిర్వహించలేదు. అయితే ఐపీఎల్ కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసినట్లు యాజమాన్యం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బెంగళూరు పోలీసుల సమన్వయంతో స్టేడియంను మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేసినట్లు ఆర్‌సీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రాయ్‌పూర్‌కు రెండు మ్యాచ్‌లు

ముందస్తు ఒప్పందాల ప్రకారం, రాయ్‌పూర్‌లో రెండు హోమ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్‌సీబీ సీఈఓ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. "చిన్నస్వామి స్టేడియం కేవలం మా హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, అది మా జట్టు గుర్తింపు. బెంగళూరు అభిమానులు ఇచ్చే శక్తి మా ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మాపై ఎనలేని ప్రేమను చూపిస్తున్న అభిమానుల కోసం, సొంత గడ్డపై వారు మ్యాచ్‌లు చూసేలా చేయడం మా బాధ్యత. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము" అని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం, పోలీసు శాఖ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.